Delhi Polls AAP Manifesto :దేశంలోని మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం ఏడు పాయింట్ల మేనిఫెస్టోను ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బుధవారం విడుదల చేశారు. పన్ను ఉగ్రవాదం వల్ల మధ్యతరగతి ప్రజల బతుకులు చితికిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు సిసలైన సూపర్ పవర్ లాంటి మధ్యతరగతి ప్రజానీకాన్ని కేంద్రంలోని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశాన్ని పాలించిన పార్టీలన్నీ పన్ను బాదుడుతో మిడిల్ క్లాస్‌ను వేధించాయని విమర్శించారు. తాము విడుదల చేసిన ఏడు పాయింట్ల మేనిఫెస్టో మధ్యతరగతి ప్రజానీకం సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుందని ఆప్ అధినేత పేర్కొన్నారు.
ఆప్ 'మిడిల్ క్లాస్ మేనిఫెస్టో' రిలీజ్- బీజేపీ టార్గెట్‌గా ఏడు డిమాండ్లు - DELHI POLLS AAP MANIFESTO
దిల్లీలోని మధ్యతరగతి ప్రజల కోసం ఆప్ 7 పాయింట్ల మేనిఫెస్టో- విడుదల చేసిన అరవింద్ కేజ్రీవాల్- ఆర్థిక వ్యవస్థకు సిసలైన సూపర్ పవర్ మిడిల్ క్లాస్ అని వ్యాఖ్య
Published : Jan 22, 2025, 3:01 PM IST
ప్రభుత్వాలకు ఏటీఎంలా మధ్యతరగతి వాళ్లే
'దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని అధికార పార్టీలకు లెక్కే లేదు. మిడిల్ క్లాస్ తరఫున మేం మాట్లాడతాం. కొన్ని పార్టీలు మతం పేరుతో ఓటు బ్యాంకును తయారు చేసుకున్నాయి. ఇంకొన్ని పార్టీలు పారిశ్రామికవేత్తల పేరుతో నోటుబ్యాంకును తయారు చేసుకున్నాయి. ఆ రెండింటి నడుమ ఎక్కడా మధ్యతరగతి ప్రజలు కనిపించరు. ఓటు బ్యాంకు, నోటు బ్యాంకు నడుమ మిడిల్ క్లాస్ నలిగిపోతోంది. ప్రభుత్వాలకు ఏటీఎంలా మధ్యతరగతి మారిపోయారు. ఈసారి కేంద్ర బడ్జెట్‌లోనైనా మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయాలి' అని కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ కోరారు.
మేనిఫెస్టోలోని ఏడు డిమాండ్లు
- దేశంలో విద్యా బడ్జెట్‌కు కేటాయింపులను ప్రస్తుతమున్న 2 శాతం నుంచి 10 శాతానికి పెంచాలి.
- ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులపై పరిమితి విధించాలి.
- ఉన్నత విద్య చదివే వారికి ఫీజుల్లో రాయితీలతో పాటు ఉపకారవేతనాలు అందించాలి.
- దేశ జీడీపీలో 10 శాతానికి సమానమయ్యేలా వైద్యసేవల రంగానికి కేటాయింపులను పెంచాలి.
- ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్నులు తొలగించాలి.
- మధ్యతరగతికి ఊరటనిచ్చేలా ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలి.
- నిత్యావసరాలపై జీఎస్‌టీని తొలగించాలి. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థికభారం చాలా తగ్గిపోతుంది.
- రిటైరయ్యే ఉద్యోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
- సీనియర్ సిటిజెన్లకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యానికి ఏర్పాట్లు చేయాలి.
- సీనియర్ సిటిజెన్ల రైల్వే టికెట్లలో 50 శాతం రాయితీని ఇచ్చే నిబంధనలను తిరిగి అమల్లోకి తేవాలి.