Delhi Heavy Rainfall : దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఒక్కరోజే 24 గంటల్లో 228 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు దిల్లీలోని సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 88 ఏళ్లలో జూన్ నెలలో ఓ రోజు అత్యధికంగా వర్షం కురవడం ఇదే తొలిసారి. 1936 జూన్ 24న దిల్లీలో 235.5 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఇక భారీ వర్షాలు కారణంగా వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్టు తెలుస్తోంది. మరో ఘటనలో ఇంటి గోడ కూలి ముగ్గురు చిన్నారులు మరణించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్‌ను దిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రెస్క్యూ బృందాలను సిద్ధం చేసింది. భారీగా వరద నీరు రావడం వల్ల ఎయిమ్స్‌లో పలు వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది.
దిల్లీలోని వసంత్ విహార్ వద్ద నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురు కార్మికులు చనిపోయారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారి మృతదేహాలను శనివారం వెలికితీశారు. న్యూ ఉస్మాన్‌పుర్‌లో వర్షపు నీరు నిండిన కాలువలో ఆడుకుంటూ ఇద్దరు చిన్నారులు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. మరో ఘటనలో షాలిమార్ బాగ్ ప్రాంతంలో ఓ అండర్‌పాస్ వద్ద వరద నీటిలో మునిగి 20 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. రోహిణిలోని ప్రేమ్ నగర్ ప్రాంతంలో 39 ఏళ్ల వ్యక్తి లైవ్ వైర్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురై మరణించాడు. దిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ పైభాగం కూలి క్యాబ్ డ్రైవర్ మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్ద గోడ కూలి ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు.
సమీక్షించిన మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇక దిల్లీ విమానాశ్రయం ఘటనలో గాయపడి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పరామర్శించారు. మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడ్డవారికి రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అన్ని విభాగాల అధికారులతో మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో నిర్మాణాల సామర్థ్యాన్ని తనిఖీ చేసి, అయిదు రోజుల్లోపు నివేదికలు సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అప్రమత్తమైన దిల్లీ సర్కారు పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించింది.