Economic Survey : బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2024-25 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచారు.
ఆర్థిక సర్వేలోని ముఖ్యాంశాలివే
- 2024-25లో దేశ జీడీపీ వృద్ధి రేటు అంచనా 6.4శాతం
- 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటు 6.3-6.8 శాతంగా ఉండొచ్చు.
- ప్రైవేటు రంగ వినియోగం స్థిరంగా ఉంది.
- వచ్చే ఏడాది ఆర్థిక పరిస్థితులు మందకొడిగా ఉంటాయని అంచనా
- రబీ పంట దిగుబడి బాగుంటే 2026 తొలి అర్ధభాగంలో ఆహార పదార్థాల ధరలు తగ్గే అవకాశం ఉంది.
- ఖరీఫ్ పంట రావడం వల్ల ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. దీంతో 2024-25 నాలుగో త్రైమాసికంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చు.
- 2025-26 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ భయాలు కాస్త తగ్గుముఖం పట్టొచ్చు. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల రూపంలో ఇంకా ముప్పు పొంచి ఉంది.
- ప్రభుత్వ మూలధనం పెరగడం, వ్యాపార అంచనాలు మెరుగుపడటం వల్ల పెట్టుబడులు పుంజుకుంటాయని అంచనా.
- దేశీయంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయంగా బలహీన డిమాండ్ నేపథ్యంలో గతేడాది తయారీ రంగం ఒత్తిడికి గురైంది.
- గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఐపీఓ లిస్టింగ్‌లు గణనీయంగా నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఐపీఓ లిస్టింగ్‌ల్లో మన వాటా 30శాతంగా ఉంది. 2023తో పోలిస్తే ఇది 17శాతం ఎక్కువ.
- గత ఐదేళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీని వల్ల భారీ మౌలికవసతుల రంగాల్లో కేంద్ర మూలధన వ్యయం 2020 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 38.8 శాతం పెరిగింది.
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో 5853 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి.
- జల్ జీవన్ మిషన్ కింద ఇప్పటివరకు 12 కోట్లకు పైగా కుటుంబాలకు కుళాయిల ద్వారా తాగునీటి సదుపాయం.
కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సర కాలంలో దేశ ఆర్థిక పనితీరును రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి చెప్పేదే ఈ ఎకనమిక్ సర్వే. ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్‌లోని ఎకనమిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. తొలుత 1950-51 సంవత్సరం నుంచి ఆర్థిక సర్వేను బడ్జెట్‌తో పాటే ప్రవేశపెట్టేవారు. 1960 తర్వాత బడ్జెట్‌కు ఒక రోజు ముందు ప్రవేశపెట్టే సంప్రదాయం మొదలైంది. శుక్రవారం నిర్మల ఆర్థిక సర్వే ప్రవేశ పెట్టిన అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను శనివారానికి వాయిదా వేశారు. శనివారం (ఫిబ్రవరి 1న) కేంద్ర పద్దును నిర్మల సభకు సమర్పించనున్నారు.