Jayalalitha Jewellery Handover To Tamilnadu Government : ఆరు ట్రంకు పెట్టెలు తీసుకువచ్చి దివంగత ముఖ్యమంత్రి జయలలిత వజ్రాభరణాలు తీసుకెళ్లాలని బెంగళూరు సిటీ సెషన్స్ కోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలతో పాటు దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సిందిగా సూచించింది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో వాటిని అప్పగించాలని 36వ సిటీ సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశించారు. ఈ విషయంపై పిటిషన్ దాఖలు చేసిన ఆర్టీఐ కార్యకర్త టీ నరసింహ మూర్తి అదే తేదీల్లో కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
జప్తు చేసిన జయలలిత వస్తువులు ఇవే!
- 7,040 గ్రాముల బరువున్న 468 రకాల బంగారు, వజ్రాల ఆభరణాలు
- 700 కిలోల వెండి ఆభరణాలు
- 740 జతల ఖరీదైన చెప్పులు
- 11,344 పట్టు చీరలు
- 250 శాలువాలు
- 12 రిఫ్రిజిరేటర్లు
- 10 టీవీ సెట్లు
- 8 వీసీఆర్‌లు
- 1 వీడియో కెమెరా
- 4 సీడీ ప్లేయర్లు
- 2 ఆడియో డెక్‌లు
- 24 టూ-ఇన్-వన్ టేప్ రికార్డర్లు
- 1040 వీడియో క్యాసెట్లు
- 3 ఇనుప లాకర్లు
- రూ.1,93,202 నగదు
ఇదీ కేసు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని గతేడాది ఫిబ్రవరిలో నిర్ణయించింది.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జయలలిత మేనకోడలు జె దీప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం హైకోర్టు- కింది కోర్టు ఆదేశాలపై స్టే విధించింది. అనంతరం ఆ పిటిషన్లపై విచారణ జరిపి వాటిని కొట్టి వేస్తూ తీర్పునిచ్చింది. దీంతో జయలలిత వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే బెంగళూరు సిటీ సెషన్స్ కోర్టు వజ్రాభరణాల అప్పగింతకు తేదీలు ఖరారు చేసింది.