Delhi HC Stays Arvind Kejriwal Bail :మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దిల్లీ హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఈడీ సమర్పించిన ఆధారాలను పరిశీలించడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేటప్పుడు జడ్జి సహేతుకంగా ఆలోచించలేదని జస్టిస్ సుధీర్ కుమార్ జైన్‌తో కూడిన హైకోర్టు వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. దిల్లీ మధ్యం కుంభకోణానికి సంబంధించిన కేసును వాదించడానికి ఈడీకి తగిన అవకాశం ఇవ్వాలని పేర్కొంది.
సీఎం కేజ్రీవాల్ బెయిల్‌పై దిల్లీ హైకోర్టు స్టే విధించడంపై స్పందించారు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది రిషికేశ్ కుమార్. 'మేము ఇప్పటికే సుప్రీంకోర్టులో మధ్యంతర స్టేను సవాల్ చేశాం. రేపటికి ఆ కేసు లిస్ట్ అయ్యింది. దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు కాపీతో సుప్రీం కోర్టులో ఒక దరఖాస్తును దాఖలు చేస్తున్నాం. కోర్టు ఈ ఉత్తర్వును పరిగణనలోకి తీసుకోవాలి' అని పేర్కొన్నారు.
కాగా, మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు జూన్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ట్రయల్ కోర్టు. రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుపై ఆయన్ను విడుదల చేయవచ్చని స్పష్టం చేసింది. విచారణకు ఆటంకం కలిగించరాదని, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని షరతులు విధించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది ఈడీ. కింది కోర్టు ఉత్తర్వులను సవాల్ చేసింది. దిగువ న్యాయస్థానం తమ వాదనలు పూర్తిగా వినలేదని పేర్కొంది. ఆ తర్వాత కేజ్రీవాల్ బెయిల్ పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు ఇచ్చింది.