తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వామపక్షాల కన్నా 'నోటా'కే ఎక్కువ ఓట్లు- ఆరుగురికి సింగిల్‌ డిజిట్‌- అసెంబ్లీకి ఐదుగురు మహిళలే! - DELHI ELECTION RESULTS 2025

వామపక్షాలు ఏకమైనా నోటాదే పైచేయి- అత్యధిక మెజార్టీలు ఆప్‌కు, అత్యల్పం బీజేపీకి!

Delhi Election Results 2025
Delhi Election Results 2025 (ANI)

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2025, 7:25 AM IST

Delhi Election Results 2025 :ప్రతిష్ఠాత్మకంగా జరిగిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ముగ్గురు అభ్యర్థులు కూడా ఆమ్‌ ఆద్మీపార్టీకి చెందినవారే. అత్యల్ప మెజార్టీతో చివరి మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నిలిచారు. అత్యధిక మెజార్టీ పొందిన వారిలో తొలి రెండు స్థానాల్లో మైనార్టీ అభ్యర్థులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీ మధ్య ఓట్ల తేడా దాదాపు 2% మాత్రమే ఉన్నా, 26 సీట్ల తేడా వచ్చింది.

ఆప్‌ అత్యధిక మెజార్టీ దక్కించుకున్న మతియామహల్, సీలంపుర్, డివోలి నియోజకవర్గాల్లో బీజేపీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలవలేదు. అత్యల్ప మెజార్టీలు నమోదైన స్థానాల్లో జంగ్‌పుర కూడా ఉంది. అక్కడ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా ఓటమిపాలయ్యారు. ఈ స్థానంలో తొలిసారి, త్రిలోక్‌పురి, సంగం విహార్‌లలో రెండోసారి బీజేపీ విజయం సాధించింది.

వామపక్షాలు కన్నా నోటాకే!
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు 6 చోట్ల కలిసి పోటీచేసినా, నోటా (అభ్యర్థులెవరూ నచ్చలేదు) కంటే ఎక్కువ ఓట్లు సాధించలేకపోయాయి. సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చి రెండేసి నియోజకవర్గాల్లో కలిసి పోటీ చేశాయి. ఈ ఆరు స్థానాల్లో వామపక్షాల అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు కేవలం 2,158. దీనికి రెట్టింపు కంటే ఎక్కువగా 5,627 మంది ఓటర్లు ఆ 6 చోట్ల నోటా మీట నొక్కారు. జాతీయ పార్టీలైన బీఎస్పీ, సీపీఎంల కంటే ఓటర్లు నోటాను ఎక్కువగా ఎంచుకున్నారు. శనివారం ఈసీ వెల్లడించిన ఓట్ల లెక్కింపు గణాంకాల మేరకు దిల్లీలో నోటాకు 0.57 శాతం ఓట్లు రాగా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)కి 0.55 శాతం, సీపీఎంకు 0.01 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. సీపీఐ 0.01 శాతం, జేడీయూ 0.53 శాతం ఓట్లు సాధించాయి.

ఐదుగురు మహిళల గెలుపు
ఈ దఫా ఎన్నికల్లో ఐదుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. 2020 ఎన్నికల్లో 8 మంది విజయం సాధించారు. తాజాగా గెలుపొందిన అతివల్లో ఆతిశీ ఒక్కరే ఆప్‌ తరఫున గెలిచారు. మిగతా నలుగురూ బీజేపీ అభ్యర్థులే. ఈ దఫా బరిలోకి దిగిన 699 మంది అభ్యర్థుల్లో 96 మంది మహిళలు ఉన్నారు.

ఆరుగురు అభ్యర్థులకు సింగిల్‌ డిజిట్‌ ఓట్లే
న్యూదిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన అభ్యర్థుల్లో ఆరుగురికి సింగిల్‌ డిజిట్‌ ఓట్లే వచ్చాయి. వీరంతా చిన్న పార్టీలకు చెందినవారు. వీరిలో అత్యంత తక్కువగా ఈశ్వర్‌ చంద్‌ (భారత్‌ రాష్ట్ర డెమోక్రటిక్‌ పార్టీ)కు నాలుగు ఓట్లే లభించాయి.

6 ముస్లిం సీట్లలో ఆప్‌ విజయం
ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కూడా 2020లో విజయం సాధించిన ఆప్‌ ఈసారి ఆరు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముస్తఫాబాద్‌లో ముస్లిం ఓట్లను ఆప్, ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీల తరఫున బరిలోకి దిగిన ముస్లిం అభ్యర్థులు పంచుకోవడం వల్ల బీజేపీ తరఫున పోటీచేసిన మోహన్‌సింగ్‌ బిష్త్‌ విజయకేతనం ఎగురవేశారు.

ABOUT THE AUTHOR

...view details