Delhi Coaching Centre Tragedy :దేశ రాజధాని దిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు బలైన ఘటన తీవ్ర కలకలం రేపింది. స్టడీ సెంటర్ నిర్వాహకులు పార్కింగ్, సరకు నిల్వ పేరుతో అనుమతి తీసుకుని సెల్లార్‌లో అక్రమంగా లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, సెంటర్ కో-ఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ముగ్గురు విద్యార్థులు బలయ్యారని ఆరోపించారు. చిన్నపాటి వర్షానికే వరద ముంచెత్తితే మున్సిపల్ యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
గోబ్యాక్ మాలీవాల్ అంటూ నినాదాలు!
ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని 12 రోజుల క్రితమే కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లినట్లు విద్యార్థులు చెప్పారు. వెంటనే చర్యలు తీసుకొని ఉంటే ప్రమాదం జరిగేది కాదని ఆరోపించారు. కోచింగ్ సెంటర్ వద్దకు వెళ్లిన ఆప్ తిరుగుబాటు ఎంపీ స్వాతి మాలీవాల్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ ఘటనను రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. గో బ్యాక్ మాలీవాల్ అంటూ నినాదాలు చేశారు. విద్యార్థులు అభ్యంతరం తెలిపినా కూడా ఆమె అక్కడి పరిస్థితులను పరిశీలించారు. దిల్లీలో సెల్లార్ల నిర్వహణలో పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు స్వాతి మాలివాల్ విమర్శించారు.
పార్కింగ్ కోసమని చెప్పి!
2021లో మూడంతస్తుల భవన నిర్మాణ ప్లాన్‌కు అధికారులు ఆమోదించారు. భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా లభించింది. సెల్లార్‌ను పార్కింగ్, సరకు నిల్వ కోసమే వినియోగిస్తామని చెప్పి అనుమతి పొందినట్లు అధికారులు తెలిపారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్‌లో లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన దిల్లీ మేయర్ షెల్లీ ఒబెరాయ్ రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లను వినియోగించుకుంటున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఒబెరాయ్ పేర్కొన్నారు.
ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం వల్ల సామాన్యులు ఇలా!
రావ్ ఐఏఎస్ సెంటర్ ప్రమాద ఘటనపై స్పందించారు లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ. భవన నిర్మాణ ప్రణాళిక, భద్రత లేని నిర్మాణం, ప్రభుత్వ సంస్థల నిర్లక్ష్యం వల్ల సామాన్యులు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సురక్షిత, సౌకర్యవంతమైన జీవనం ప్రతి పౌరుడి హక్కని రాహుల్ పేర్కొన్నారు. డ్రెయిన్లను శుభ్రం చేయాలని స్థానికులు పదేపదే చెప్పినా ఆప్ ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ పట్టించుకోలేదని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ జల్ బోర్డు మంత్రి ఆతిశీ, ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మూడు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బలి
శనివారం కురిసిన వర్షానికి రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరద పోటెత్తింది. సెల్లార్‌లో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. తాళ్లసాయంతో పలువురిని రక్షించారు. అయితే తెలంగాణకు చెందిన తానియాసోని, యూపీకి చెందిన శ్రేయాయాదవ్, కేరళకు చెందిన నెవిన్ డాల్విన్ మృతి చెందారు.