Delhi CM Atishi Resignation :దిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆతిశీ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం లెఫ్టెనెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన ఆతిశీ, తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ దిల్లీ శాసనసభను రద్దు చేశారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేవీ నడ్డా వెళ్లారు. దిల్లీ సీఎం విషయంపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
శనివారం వెలువడిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీని బీజేపీ ఓడించింది. ఈ నేపథ్యంలో సీఎం పదవికి ఆతీశీ రాజీనామా చేశారు. ఆప్ నేతఅరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించి గతేడాది సెప్టెంబర్‌లో బయటకు వచ్చాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రజలు మళ్లీ తనను మళ్లీ గెలిపించే వరకూ పదవిలో ఉండను అంటూ సీఎంగా ఆతిశీని ప్రతిపాదించారు. దీంతో ఆమె అనూహ్యంగా ఆతిశీ సీఎం పదవిని చేపట్టారు.
ఈ ఎన్నికల్లో ఆప్ అధినేత కేజ్రీవాల్ సహా అగ్రనేతలు మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి ఆతిశీ మాత్రం కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఒకదశలో వెనుకంజలో ఉన్న ఆమె ఆ తర్వాత పుంజుకుని బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరిపై 3,521 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు.
దిల్లీ సీఎం ప్రమాణస్వీకారం అప్పుడే
ఇక దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ, సీఎం అభ్యర్థిగా ఎవరని నిర్ణయిస్తుందా అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దిల్లీ సీఎం రేసులో మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ తర్వాత బీజేపీ మాజీ అధ్యక్షులైన విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ, జాతీయ కార్యదర్శి దుష్యంత్ గౌతమ్‌తో పాటు బీజేపీ ఎంపీ బన్సూరీ స్వరాజ్ పేర్లు ముఖ్యమంత్రి రేసులో ఉన్నాయి. అయితే, పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు ప్రధాని మోదీ ఈ నెల 10 నుంచి ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లనున్నారు. ఆయన తిరిగి వచ్చాకనే ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.