Delhi Polls Dalit Votes :దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు మూడు పార్టీలు పోటీపడి మరీ హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల్లో కీలకంగా మారే దళిత ఓటర్లుపై మూడు పార్టీలు దృష్టి సారించాయి. అయితే, ఈ ఎన్నికల్లో దళితుల ఓట్లు 3 పార్టీల మధ్య చీలే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆప్ సర్కార్‌పై అసంతృప్తి!
అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వుడ్ సీట్లు, మెజారిటీ దళిత ఓట్లు ఉన్న 30 నియోజకవర్గాలు గెలుపులో కీలకంగా మారుతున్నాయి. దిల్లీలో వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టాలని చూస్తున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ గత ఎన్నికల్లో దళితుల మద్దతు పొందారు. అయితే వారి జీవితాల్లో పెద్దగా మార్పు లేకపోవడం వల్ల అప్ సర్కార్‌పై అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నట్లు నిపుణులు అంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆప్‌కు దళితుల మద్దతు తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుడు, సబాల్టర్న్ మీడియా పౌండేషన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ కుశ్ అంబేడ్కర్వాదీ పేర్కొన్నారు.
ఇక బీజేపీ 2015, 2020 జరిగిన దిల్లీ శాసనసభ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలలో కనీసం ఖాతా తెరవలేకపోయింది. అంతకుముందు జరిగిన ఎన్నికల్లోనూ 2-3 సీట్లతోనే సరిపెట్టుకుంది. దీంతో ఈసారైనా గెలవాలని ప్రణాళిలను సిద్ధం చేస్తోంది. దళితులను ఆకర్షించేందుకు అనేక వ్యూహాలను రచిస్తోంది. వారి కోసం హమీలను ప్రకటిస్తోంది. వాటిని ఓటర్లలోకి తీసుకెళ్లేందుకు దళిత మెజారిటీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గత కొన్ని నెలలుగా దళితుల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ ఎస్సీ మోర్చా అక్కడ ముమ్మరంగా పనిచేస్తోంది.
కాంగ్రెస్ ఆలస్యం!
మరోవైపు ఎస్సీ నియోజకవర్గాలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ లెక్కలు వేస్తోంది. కానీ దళిత ఓటర్లను ఆకర్షించడంలో కాంగ్రెస్ ఆలస్యం చేస్తోందని గతేడాది ఆప్ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తుగా ప్రచారం ప్రారంభించి ఉంటే మరింత మద్దతు పొందేవాళ్లమని అన్నారు.
ప్రజాదరణ తగ్గినా ఆప్కే మద్దతు
నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్ నిర్వహించిన సర్వే ప్రకారం- ఆప్‌కు ప్రజాదరణ తగ్గినప్పటికీ దళిత ఓటర్లు మద్దతు ఎక్కువగానే ఉందని చెప్పింది. సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది ఆప్‌కు, బీజేపీకి 32 శాతం, కాంగ్రెస్ 21 శాతం మంది ఓట్లు వేస్తారని చెప్పినట్లు పేర్కొంది. ఈ సర్వేను జనవరి 1- 15 మధ్య నిర్వహించినట్లు తెలిపింది.