Fengal Cyclone :బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెయింజల్ తుపాను తీరం దాటింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య మహాబలిపురం-కరైకల్ వద్ద తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుందని, ఈ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపింది. భారీగా వర్షాలు కురవడం వల్ల చెన్నై సహా పలు జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. గత 34 గంటల్లో చాలా ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల నుంచి 27 సెంటీ మీటర్ల మధ్య వర్షపాతం నమోదైంది. చెన్నై నగరవ్యాప్తంగా 134 ప్రాంతాలు నీట మునిగినట్లు అధికారుల అంచనా వేశారు. గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, కుండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. బలమైన గాలులు వల్ల చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని, వాటిని తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రాకపోకలకు అంతరాయం
చెన్నై విమానాశ్రయంలోకి నీరు చేరడం వల్ల శనివారం తాత్కాలికంగా మూసివేశారు. ఇండిగో సంస్థ చెన్నై మీదుగా వెళ్లే తమ విమానాలన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేసుకున్నట్లు ప్రకటన చేసింది. వివిధ సంస్థలకు చెందిన మొత్తం 55 విమానాలు తాత్కాలికంగా రద్దయ్యాయి. మరో 12 విమానాలను దారి మళ్లించారు. భారీవర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పాడింది. అటు తుపాను కారణంగా పుదుచ్చేరిలో పర్యాటక ప్రాంతాలనూ మూసేశారు.
కరెంట్ షాక్‌లో వ్యక్తి మృతి
చెన్నై ముత్యాలపేటలోని ఏటీఎంలో శనివారం నగదు తీసుకోవడానికి వెళ్లిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన చందన్(20) విద్యుదాఘాతానికి మృతి చెందాడు. ఏటీఎం బయట ఉన్న ఇనుప రాడ్డుపై చేతులు పెట్టడం వల్ల షాక్‌తో అక్కడే మృతిచెందాడు. చందన్ మృతదేహం వరద నీటిలో కొట్టుకుపోతుండగా స్థానికులు అధికారులకు తెలిపారు.
పూర్తి స్థాయిలో సహాయక చర్యలు
తమిళనాడులోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 22వేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు చెప్పారు. శనివారం చెన్నైలోని విపత్తు నిర్వహణ కంట్రోల్ రూంను తమిళనాడు సీఎం స్టాలిన్ సందర్శించి ప్రభుత్వ ఏర్పాట్లు, ముందుజాగ్రత్త చర్యలను సమీక్షించారు. పుదుచ్చేరిలో ప్రభావిత ప్రాంతాల్లో 12లక్షల మందిని తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. వారికి ఆహారం, తాగునీరు సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు.