Money In Rice Bag : దొంగలకు భయపడి రూ.15 లక్షలను బియ్యం బస్తాలో దాచిపెట్టాడు ఓ షాపు యజమాని. ఆ విషయం తెలియని అతడి బంధువులు ఆ రైస్ బ్యాగ్ అమ్మేశారు. ఎలాగోలా ఆ బియ్యం కొన్న వ్యక్తి వివరాలు తెలుసుకుని ఇంటికి వెళ్లాడు షాపు యజమాని. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తమిళనాడు కడలూరు జిల్లాలోని వడలూరు రాఘవేంద్ర సిటీకి చెందిన షణ్ముగం అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా బియ్యం దుకాణం నడుపుతున్నాడు. అతడి దుకాణం వడలూరు- నైవేలి ప్రధాన రహదారిపై ఉంటుంది. దొంగల భయం ఎక్కుగా ఉండటం వల్ల షణ్ముగం ఆదివారం (అక్టోబర్ 20న) తన దగ్గర ఉన్న రూ.15 లక్షల నగదును బియ్యం మూటలో దాచి పెట్టి వెళ్లిపోయాడు. మరసటి రోజు ఉదయం వెళ్లి చూసే సరికి డబ్బులు దాటి పెట్టిన రైస్ బ్యాగ్ కనిపించలేదు.
దీంతో షాక్ గురైన షణ్ముగం, తను దుకాణంలో లేని సమయంలో షాపు చూసుకున్న అతడి బంధువు శ్రీనివాసన్‌ను రైస్ బ్యాగ్ గురించి ప్రశ్నించాడు. షాపులో బియ్యం కొనడానికి వచ్చిన వ్యక్తికి అమ్మినట్లు చెప్పాడు. దీంతో షణ్ముగం షాపులోని సీసీటీవీ ఫుటేజీ చెక్ చేశాడు. ఆ రైస్ బ్యాగ్ కొన్నప్పుడు క్యాష్‌ను గూగుల్ పే ద్వారా చెల్లించినట్లు తెలుసుకున్నాడు. ఆ వివరాలతో మేల్పాడి గ్రామానికి చెందిన పూపాలన్ అనే వ్యక్తి రైస్‌ను కొనుగోలు చేసినట్లు తెలుసుకుని అతడి ఇంటికి వెళ్లాడు.
తన షాపు నుంచి కొన్న బియ్యం మూటలో రూ.15 లక్షలు ఉండాలని, వాటిని తిరిగి ఇచ్చేయాలని పూపాలన్ కుటుంబ సభ్యులను అడిగాడు షణ్ముగం. అందులో కేవలం రూ.10 లక్షలే ఉన్నాయని తెచ్చి ఇచ్చింది పూపాలన్ కుమార్తె. మిగిలిన డబ్బులు గురించి అడిగితే ఇంతే ఉన్నాయని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత షణ్ముగం అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇరువురి పిలిచి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే ప్రధాన రహదారి అవ్వడం వల్ల దొంగల భయం ఎక్కువగా ఉంటుందని, అందుకే డబ్బుల్ని- క్యాష్ డ్రాయర్లో పెట్టకుండా భద్రంగా దాచిపెట్టుకున్నాని షణ్ముగం చెప్పాడు.