CPM On Lok Sabha Results 2024 : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని వామపక్ష పార్టీ సీపీఎం వ్యాఖ్యానించింది. సార్వత్రిక ఎన్నికల్లో పూర్తి మెజార్టీ సాధించడంలో కమలం పార్టీ పూర్తిగా విఫలమైందని, దీనికి మోదీ ప్రభుత్వం అవలంబించిన ఫాసిస్ట్ పద్ధతులే కారణమని ఆరోపించింది. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం హిందుత్వ నిరంకుశత్వాన్ని వీడి ప్రజలకు మెరుగైన పాలన అందించాలని హితవు పలికింది. దిల్లీలో సోమవారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సమీక్షించింది.
ఓట్ల శాతం పెరిగినా!
2024 ఎన్నికల్లో వామపక్షాలు స్వల్పంగా తమ ఉనికి మెరుగుపరుచుకున్నాయని వెల్లడించింది. కేరళలో ఎన్నికల పనితీరుపై మాత్రం నిరాశ వ్యక్తం చేసింది. 18వ లోక్‌సభను ఏర్పాటు చేసేందుకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని సీపీఎం పొలిట్ బ్యూరో పేర్కొంది. దేశ ప్రజలు రాజ్యాంగాన్ని, లౌకిక ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించారని, బీజేపీకి మెజార్టీ ఇవ్వకుండా హెచ్చరిక చేశారని తెలిపింది. 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ సాధించిన ఎన్డీఏ, ఈ ఎన్నికల్లో మాత్రం సంకీర్ణ ప్రభుత్వానికే పరిమితమైందని గుర్తు చేసింది. చార్ సౌ పార్ అంటూ నినదించిన కమల దళం కేవలం 240 సీట్లే సాధించిందని, కాషాయ పార్టీకి మెజారిటీ కన్నా 32 సీట్లు తక్కువగా ఉన్నాయని సీపీఎం గుర్తు చేసింది.