Sitaram Yechury Biography : సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వాస్తవ్యులు. తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజినీర్‌గా పనిచేశారు. ఆయన తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా ఏచూరి మేనమామ. హైదరాబాద్‌లో పెరిగిన ఏచూరి ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదువుకున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఉన్నత విద్యాభ్యాసం కోసం దిల్లీ వెళ్లారు. ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో ఇంటర్ పూర్తి చేసిన ఆయన సీబీఎస్ఈ పరీక్షల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రం పూర్తిచేశారు. అక్కడే పీహెచ్డీ చేస్తుండగా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని సీతారాం ఏచూరి అరెస్టయ్యారు.
సీతారాం ఏచూరి 1974లో సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరారు. 1978లో ఎస్ఎఫ్ఐ ఆలిండియా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత అనతికాలంలోనే ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. అప్పటివరకు బంగాల్, కేరళ రాష్ట్రాలకు చెందినవారే ఎస్ఎఫ్ఐ అధ్యక్షులుగా ఉండేవారు. ఆ రెండురాష్ట్రాల నుంచి కాకుండా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షునిగా ఎన్నికైన తొలివ్యక్తిగా ఏచూరి ఘనత సాధించారు. 1975లో సీపీఎంలో చేరిన ఏచూరి 1984లో పార్టీ సెంట్రల్ కమిటీలో చోటుదక్కించుకున్నారు. 1985లో పార్టీ రాజ్యాంగ సవరణ కోసం సీపీఎం ఐదుగురు సభ్యులతో సెంట్రల్ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసింది. అందులో ప్రకాశ్ కారత్, సునీల్ మొయిత్రా, పి.రామచంద్రన్, ఎస్.రామచంద్రన్ పిళ్లైతోపాటు సీతారాం ఏచూరీ సభ్యులుగాఉండేవారు.
1992లో జరిగిన సీపీఎం పార్టీ మహాసభల్లో ఏచూరి పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. అనంతరం 2015లో విశాఖలో జరిగిన 21వ మహాసభల్లో సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. 2018లో హైదరాబాద్‌లో, 2022లో కేరళలో జరిగిన 22, 23వ మహాసభల్లో సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఏచూరీ తిరిగి ఎన్నికయ్యారు. 2004లో యూపీఏతో పొత్తు విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2005 జులైలో పశ్చిమ బెంగాల్ నుంచి సీతారాం ఏచూరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017 వరకు పెద్దలసభలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రజా సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు.