Constitution Day Celebration Kharge :ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్లే తాము కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలో ఐక్యత కావాలంటే విద్వేషాలను విస్తరించడం మానుకోవాలని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దిల్లీలోని తల్కటోరా స్టేడియంలో నిర్వహించిన 'సంవిధాన్ రక్షక్ అభియాన్' కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. బ్యాలెట్ పేపర్‌కు తిరిగి వచ్చేందుకు భారత్ జోడో యాత్ర తరహాలో ప్రచారం చేయాలని ఖర్గే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కొందరు రాజ్యాంగాన్ని పొగిడి, దానికి నమస్కరించి భక్తిని ప్రదర్శిస్తుంటారని ఖర్గే అన్నారు. లోపల మాత్రం రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారన్నారు. ఈ యాత్రలో ఆయనతో పాటు సమాజంలోని అన్నివర్గాల ప్రజలు కదిలివచ్చారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల బాటలో అడ్డుగోడ
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల బాటలో అడ్డుగా ఉన్న గోడను ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ మరింత బలోపేతం చేస్తున్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ గోడను బలహీనం చేసేందుకు యూపీఏ ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో చేయలేకపోయిందని అంగీకరించారు. సంవిధాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ పార్లమెంటులో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
'మోదీ రాజ్యాంగం చదవలేదు'
ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగం చదవలేదని, అందుకు తాను గ్యారంటీ అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ రాజ్యాంగం చదివి ఉంటే ఇలా చేయరని రాహుల్ పేర్కొన్నారు. దేశంలోని మొత్తం వ్యవస్థ- దళితులు, ఆదివాసీలు, వెనుకబడివర్గాలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల మార్గంలో ఉన్న అడ్డుగోడ క్రమంగా బలపడుతోందన్నారు. తాము ఆ గోడను బలహీనం చేసేందుకు ప్రయత్నిస్తే, బీజేపీ మాత్రం కాంక్రీట్‌తో బలోపేతం చేస్తోందన్నారు. తెలంగాణలో నిర్వహిస్తున్న కులగణనను చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించిన రాహుల్, కాంగ్రెస్ అధికారం వచ్చిన రాష్ట్రాల్లో ఆ పని చేస్తుందని తేల్చిచెప్పారు.