Congress Protest For Resignation SEBI chief :అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) విచారణ జరిపించాలని, సెబీ చీఫ్ మాధబి పురి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 22న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. అలాగే ఈడీ కార్యాలయాన్ని ఘెరావ్ చేస్తామని పేర్కొంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్‌లు, పీసీసీ అధ్యక్షుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
"కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, ఇంఛార్జ్ లు, పీసీసీ అధ్యక్షుల సమావేశం ఈ రోజు జరిగింది. ప్రస్తుతం దేశంలో జరిగిన అతిపెద్ద కుంభకోణం గురించి చర్చించాం. అదానీ కుంభకోణంపై హిండెన్‌బర్గ్ ఆరోపణలపై జేపీసీ విచారణ, సెబీ చీఫ్ రాజీనామా వంటి అంశాలపై దేశవ్యాప్త ఆందోళనలు చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాము. అదానీ స్కామ్ లో ప్రధానమంత్రి ప్రమేయం ఉంది." అని కేసీ వేణుగోపాల్ మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
'సెబీ- అదానీ మధ్య అనుబంధంపై దర్యాప్తు అవసరం'
సెబీ, అదానీల మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఇలా చేస్తే స్టాక్ మార్కెట్లోని చిన్న పెట్టుబడిదారుల డబ్బు ప్రమాదంలో పడదని చెప్పారు. మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చీఫ్‌ను తప్పించాలని, అదానీ వ్యవహారంపై జేపీసీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.