Congress Police complaint On NDA Leaders :లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి ముప్పు ఉందంటూ దిల్లీ పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని అధికార NDA నేతలు చేస్తున్న వ్యాఖ్యలే అందుకు నిదర్శనమంటూ దిల్లీ తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ ఫిర్యాదు చేశారు. జమ్ముకశ్మీర్, హరియాణా ఎన్నికల వేళ దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో రాహుల్‌పై దాడికి కుట్ర చేస్తున్నారని మాకెన్ పేర్కొన్నారు. శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, బీజేపీ నేతలు తర్వీందర్ సింగ్ మేర్వా, రావ్‌నీత్‌సింగ్ భిట్టు, రఘురాజ్ సింగ్ రాహుల్‌పై చేసిన వ్యాఖ్యలు ఆయన భద్రతపై అనుమానాలు కలిగిస్తున్నాయని మాకెన్ తన ఫిర్యాదులో వివరించారు.
మౌనంగా ఉండకుంటే ఇందిరా గాంధీకి పట్టిన గతే మీకూ పడుతుందంటూ రాహుల్‌ను ఉద్దేశించి ఈనెల 11న తర్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను మాకెన్ తన ఫిర్యాదులో అజయ్ పేర్కొన్నారు. అలాగే రాహుల్ నాలుకను కోసి తెస్తే రూ.11లక్షలు ఇస్తానంటూ శివసేన నేత సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు రాహుల్‌కు ఉన్న ముప్పును సూచిస్తున్నాయని మాకెన్ వివరించారు. ఈ ఫిర్యాదుపై వెంటనే FIR నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఇప్పటికే దేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారని, ఈ పరిస్థితుల్లో రాహుల్‌కు హెచ్చరికలను పంపుతున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని మాకెన్ ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనారిటీల సంక్షేమంపై రాహుల్ మాట్లాడుతుంటే ఓర్వలేకే BJP నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని మాకెన్ విమర్శించారు.