తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ కంచుకోటలకు బీటలు! అమేఠీ, రాయ్​బరేలీలో పోటీకి గాంధీల వెనకడుగు? - Congress Not Contest In UP - CONGRESS NOT CONTEST IN UP

Congress Not Contest In UP : గాంధీ కుటుంబానికి రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ నియోజకవర్గాలు కంచుకోటలు. దశాబ్దాలుగా వరుస విజయాలను అందించిన ఆ రెండు స్థానాలను ఇప్పుడు గాంధీ కుటుంబం వీడనున్నట్లు సమాచారం. రాయ్‌బరేలీ పోటీ నుంచి సోనియా గాంధీ తప్పుకోగా గత ఎన్నికల్లో అమేఠీలో ఓటమిపాలైన రాహుల్‌ ఈసారి అక్కడ నుంచి బరిలో నిలవాలనుకోవడం లేదని సమాచారం. నెహ్రూ హయాం నుంచి రాహుల్‌ శకం వరకు అప్రతిహత విజయాలను అందించిన ఈ రెండు లోక్‌సభ స్థానాల్లో గాంధీ కుటుంబ వారసత్వానికి తెర పడినట్లే కనిపిస్తోంది.

Congress Not Contest In UP
Congress Not Contest In UP

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 12:16 PM IST

Updated : Mar 21, 2024, 12:45 PM IST

Congress Not Contest In UP : ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న 80 లోక్‌సభ స్థానాల్లో రాజకీయంగా అత్యంత ముఖ్యమైన ఎంపీ స్థానాలు అమేఠీ, రాయ్‌బరేలీ. దశాబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటలుగా ఉన్న ఈ రెండు లోక్‌సభ స్థానాల గోడలు బద్దలవుతున్నాయి. గత ఎన్నికల్లో అమేఠీ నుంచి రాహుల్‌ గాంధీపై బీజేపీ నేత స్మృతి ఇరానీ విజయంతో మొదలైన ఎదురుగాలి ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. అమేఠీ నుంచి రాహుల్‌గాంధీ, రాయ్‌బరేలీ నుంచి సోనియాగాంధీ బరిలో లేకపోవడం వల్ల ఈ నియోజకవర్గాల్లో గాంధీ కుటుంబ శకం ముగిసినట్లైంది.

1952 నుంచి గాంధీ కుటుంబమే
గత ఎన్నికల్లో భారీ విజయాన్ని అందించిన కేరళలోని వయనాడ్‌ నుంచే మళ్లీ రాహుల్‌గాంధీ బరిలో దిగుతుండడం, సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లడం వల్ల అమేఠీ, రాయ్‌బరేలీ ఈ రెండు నియోజకవర్గాల్లో గాంధీ కుటుంబ వారసత్వం లేకుండా పోయింది. రాయ్‌బరేలీలో 1952 నుంచి గాంధీ కుటుంబ శకమే నడిచింది. కానీ తొలిసారి అక్కడ గాంధీ కుటుంబ వారసులు ఎవరూ బరిలో నిలవడం లేదు. ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా ఆమె ఆసక్తి చూపడం లేదన్న వార్తలు వస్తున్నాయి.

గాంధీ కుటుంబ శకం ముగిసినట్లేనా?
రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ, అమేఠీలో నిర్వహించిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో అనూహ్య పరిణామాలు జరగడం కాంగ్రెస్‌ పార్టీకి మింగుడుపడలేదు. అమేఠీలో ఖాళీ రోడ్లు, రాయ్‌బరేలీలో నల్ల జెండాలతో ప్రజలు గాంధీ కుటుంబం పట్ల విముఖత చూపారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్​గాంధీ, ప్రియాంకగాంధీ ఉత్తర్​ప్రదేశ్ నుంచి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా ప్రస్తుత పరిస్థితులన్నీ అమేఠీ, రాయ్‌బరేలీలో గాంధీ కుటుంబ శకం ముగిసిందనే సంకేతాలనే ఇస్తున్నాయి. అమేఠీ నుంచి రాహుల్​, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకగాంధీ పోటీ చేస్తారని గతంలో ఊహాగానాలు వచ్చాయి. కానీ అవి వాస్తవరూపం దాల్చే అవకాశాలు లేవని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

రాహుల్​కు స్మృతి ఇరానీ సవాల్​!
2019లో రాహుల్‌గాంధీ అమేఠీలో ఓడిపోయి వయనాడ్‌కు వెళ్లారని, గాంధీకి గెలుపుపై విశ్వాసం ఉంటే వయనాడ్‌ను వదిలి అమేఠీలోనే పోటీ చేయాలని బీజేపీ నాయకురాలు, అమేఠీ ఎంపీ స్మృతి ఇరానీ సవాల్‌ విసిరారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ 55 వేల ఓట్లకుపైగా మెజార్టీతో విజయం సాధించారు.

బీటలు వారిన అమేఠీకోట!
1967 నుంచి అమేఠీ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉంది. అప్పట్నుంచి గాంధీ కుటుంబ సభ్యులో లేదా గాంధీ కుటుంబ విధేయులో ఇక్కడ వరుసగా విజయం సాధించారు. 1980లో అమేఠీలో సంజయ్‌గాంధీ విజయం సాధించగా 1981లో జరిగిన ఉపఎన్నికల్లో రాజీవ్‌గాంధీ గెలిచారు. 1991 వరకు రాజీవ్​గాంధీ అమేఠీకి ప్రాతినిధ్యం వహించారు. రాజీవ్​ హత్య తర్వాత సోనియాగాంధీ 1999లో అమేఠీ సీటును గెలుచుకున్నారు. రాహుల్​గాంధీ 2004 నుంచి 2019 వరకు అమేఠీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ అమేఠీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. అప్పటివరకూ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న అమేఠీకోట బీటలు వారాయి.

20 ఎన్నికల్లో 17 కాంగ్రెస్​వే​!
1951లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి రాయ్‌బరేలీ నియోజకవరం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉంది. తొలి ఎన్నికల్లో రాయ్‌బరేలీలో మొదలైన కాంగ్రెస్‌ విజయ ప్రస్థానం ఇప్పటివరకూ కొనసాగింది. రాయ్‌బరేలీ నియోజకవర్గంలో జరిగిన 20 లోక్‌సభ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ 17 సార్లు విజయం సాధించింది.

ఇందిరాగాంధీ పరాజయం!
1977లో ఎమర్జెన్సీ ఎత్తివేత తర్వాత జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థి చేతిలో ఇందిరాగాంధీ పరాజయం పాలయ్యారు. 1990లో బీజేపీ చెందిన అశోక్ సింగ్​ విజయం సాధించారు. ఇవి మినహా రాయ్‌బరేలీలో కాంగ్రెస్‌ ఎప్పుడు బరిలోకి దిగినా విజయకేతనమే ఎగరేసింది. గాంధీ కుటుంబంతో చారిత్రక అనుబంధం కారణంగా రాయ్​బరేలీలో కాంగ్రెస్‌ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు గణనీయంగా ఉంది. సోనియాగాంధీ వరుసగా ఐదు సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే సోనియా మళ్లీ పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం వల్ల రాయ్‌బరేలీలో కాంగ్రెస్​ బలహీనంగా మారింది. సోనియాగాంధీ అభ్యర్థిత్వం లేకపోవడం రాయ్‌బరేలీలో కాంగ్రెస్ ఆధిపత్యంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

రామమందిరం టు డిజిటల్ ఇండియా- ఈ '10' అస్త్రాలపైనే మోదీసేన గంపెడాశలు!

టార్గెట్ 370పై BJP ఫోకస్- దక్షిణాదిలో ఆ పని చేస్తే లైన్ క్లియర్?- బలాలు, బలహీనతలివే!

Last Updated : Mar 21, 2024, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details