Congress Account Freeze :వివిధ బ్యాంకుల్లో ఉన్న తమ ఖాతాల నుంచి రూ.65 కోట్లను ఆదాయపు పన్ను శాఖ అప్రజాస్వామికంగా విత్‌డ్రా చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. పన్ను రికవరీకి చెందిన అంశం న్యాయ పరిధిలో ఉన్నా, ఇలా వ్యవహరించడమేంటని ప్రశ్నించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్యం అంతమైపోతుందని పేర్కొన్నారు. తమకు న్యాయ వ్యవస్థ పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. ఖాతాల జప్తుపై ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ విచారణ చేపడుతున్నా, వివిధ బ్యాంకుల్లోని కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్‌కు చెందిన ఖాతాల నుంచి రూ.65 కోట్లను విత్‌డ్రా చేయాలని ఐటీ శాఖ బ్యాంకులకు లేఖలు రాసిందని ఆరోపించారు. ఈ కేసు న్యాయ పరిధిలో ఉన్నందును నగదను విత్‌డ్రా చేయవద్దని బ్యాంకులకు తమ పార్టీ తరఫున లేఖ రాసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేఖ వైఖరికి కాంగ్రెస్ బలిపశువుగా మారిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఉన్న రూ.115 కోట్ల పన్ను బకాయిల్లో రూ.65 కోట్లను రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఖాతాల నుంచి రికవరీ చేసినట్లుగా సమాచారం. అయితే దీనిపై హస్తం పార్టీ ఆదాయపు పన్ను శాఖ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆశ్రయించింది. ఆదాయపు పన్ను శాఖ తమ అకౌంట్ల నుంచి డబ్బును రికవరీ చేయడంపై ట్రైబ్యునల్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకునేంత వరకు నగదును విత్‌డ్రా చేయవద్దని ఆదాయపు పన్ను శాఖను కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. అయితే ఈ అంశంపై విచారణ చేపట్టేంత వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ట్రైబ్యునల్ సూచించింది.