తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ కాలుష్యం ఎఫెక్ట్ - వర్చువల్‌గానే జడ్జీల వాదనలు

దిల్లీలో వాయు కాలుష్యం కారణంగా న్యాయవాదులకు కీలక సూచనలు చేసిన భారత సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

CJI on Delhi pollution
CJI on Delhi pollution (ANI)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

CJI on Delhi pollution :దేశ రాజధాని దిల్లీలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో సుప్రీంకోర్టు భారత సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కీలక సూచనలు చేశారు. దిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతున్నందున వీలైతే జడ్జీలు వర్చువల్‌గా వాదనలు వినిపించాలని సూచించినట్లు వెల్లడించారు. మంగళవారం సుప్రీంకోర్టు బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్‌ కాలుష్యం అంశాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో తక్షణ చర్యలు అవసరమని తెలిపారు. జీఆర్‌పీఏ-4 పరిమితులను పరిగణనలోకి తీసుకొని దిల్లీలోని కోర్టులు పూర్తిగా వర్చువల్‌ విధానాన్ని అనుసరించాలని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, గోపాల్ శంకరనారాయణన్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థించారు. దీంతో ఏ కేసులైనా సరే లాయర్లు వర్చువల్‌ మోడ్‌లో పాల్గొని తమ వాదనలు వినిపించొచ్చని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సూచించారు.

ఇంకా దేశ రాజధానిలాగా కొనసాగాలా?
మరోవైపు దిల్లీ కాలుష్యం అంశంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ స్పందిస్తూ కేంద్రంపై విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో దిల్లీ దేశ రాజధానిగా కొనసాగాల్సి ఉందా అని ప్రశ్నించారు. 'ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దిల్లీ మారింది. ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయి. రెండో అత్యంత కాలుష్య నగరం బంగాల్ రాజధాని ఢాకాతో పోలిస్తే దిల్లీలో ప్రమాద స్థాయి 5 రెట్లు ఎక్కువగానే ఉంది. కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవట్లేదు. ఇలాంటి పరిణామాల మధ్య దిల్లీని ఇంకా దేశ రాజధానిగా కొనసాగించాలా?' అని ఎక్స్​ వేదికగా ప్రశ్నించారు.

కృత్రిమ వర్షమే మార్గం
దిల్లీలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని దిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ కోరారు. ఈమేరకు ఆయన కేంద్రానికి ఓ లేఖ రాసినట్లు మీడియాకు వెల్లడించారు.

'ఉత్తర భారతదేశాన్ని పొగమంచు కప్పేస్తుంది. దీనినుంచి విముక్తికి కృత్రిమ వర్షమే ఏకైక పరిష్కారం. ఇది మెడికల్‌ ఎమర్జెన్సీ. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవడం నైతిక బాధ్యత. కాలుష్య నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. కృత్రిమ వర్షంపై కేంద్రానికి గత మూడు నెలలుగా లేఖలు రాస్తున్నాను. కానీ, వారు పట్టించుకోవడం లేదు. కృత్రిమ వర్షంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటుచేయాలి. చర్యలు తీసుకోలేకపోతే మంత్రి పదవికి రాజీనామా చేయాలి' అని రాయ్‌ పేర్కొన్నారు.

దిల్లీలో వాయుకాలుష్యం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం సగటు గాలి నాణ్యతా సూచీ (AQI) 494కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్క్‌ను దాటిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీనివల్ల ఇప్పటికే పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ABOUT THE AUTHOR

...view details