Child Fell In Borewell Gujarat : గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రమాదవశాత్తు 15 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన రెండేళ్ల బాలుడిని సురక్షితంగా కాపాడారు అధికారులు. దాదాపు 6 గంటల పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించి బాలుడిని బోరుబావి నుంచి బయటకు తీశాయి. వెంటనే ఘటనాస్థలిలో ఏర్పాటు చేసిన అంబులెన్స్‌లో చిన్నారిని జామ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అధికారులు. కాగా, వ్యవసాయ భూమిలో ఆడుకుంటున్న చిన్నారి తెరిచి ఉన్న బోరుబావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడని జామ్‌నగర్ కలెక్టర్ బీకే పాండ్య తెలిపారు.
అసలేం జరిగిందంటే?
మంగళవారం సాయంత్రం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో గోవానా గ్రామానికి చెందిన రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. ఈ విషయంపై బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో జిల్లా అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని మంగళవారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు సహాయక చర్యలు ప్రారంభించాయి. దాదాపు 6 గంటలపాటు శ్రమించి బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీశాయి.
'బోరుబావిలో పడిన చిన్నారికి సమయానికి ఆక్సిజన్‌ను సరఫరా చేశాం. లోపల పడ్డ అతడిని చేరుకునేందుకు సమాంతరమైన గొయ్యిని తవ్వించాం. ప్రస్తుతం జామ్‌నగర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్యం నిలకడగానే ఉంది' అని కలెక్టర్ వివరించారు.