Child Adoption Rules : ఇతర రాష్ట్రాల నుంచి చిన్నారుల్ని తీసుకొచ్చి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేయడం.. తాజాగా సంచలనం సృష్టించింది. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 60 మంది చిన్నారులను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. ఎంతోకాలంగా పెంచుకుంటున్న పిల్లలను పోలీసులు తీసుకెళ్లే క్రమంలో.. పెంపుడు తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అటు పిల్లలు కూడా వారిని వదిల్లేక తల్లడిల్లిపోయారు. మరి.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా జరగకుండా చట్టప్రకారం పిల్లలను ఎలా దత్తత తీసుకోవాలి? ఇందుకోసం ఏం చేయాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఎవరిని దత్తత ఇస్తారంటే ?
నిస్సహాయ పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడానికి.. జాతీయ స్థాయిలో 'కేంద్రీయ దత్తత వనరుల ఏజెన్సీ' (కారా) పనిచేస్తోంది. కారా ఏజెన్సీ కింద రాష్ట్ర దత్తత వనరుల ఏజెన్సీలు పనిచేస్తాయి. ఆర్థిక భారంతో తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, అనాథ పిల్లలు, తల్లిదండ్రులే అప్పగించిన పిల్లలను.. శిశు సంక్షేమశాఖ అధికారులు చేరదీస్తారు. వీరినే దత్తత ఇస్తారు. దీనికోసం రాష్ట్రస్థాయిలో శిశువిహార్, జిల్లా స్థాయిలో శిశుగృహాలు పని చేస్తున్నాయి. వీటిల్లో ఆరేళ్లలోపు పిల్లలకు మాత్రమే సంరక్షణ ఉంటుంది. 6 ఏళ్లు దాటితే శిశుగృహాల నుంచి బాలసదన్‌కి పంపించి చదువు నేర్పిస్తారు.
పిల్లలను దత్తత తీసుకోవడానికి ఏం చేయాలి ?
- పిల్లలను దత్తత తీసుకోవాలనుకునే దంపతులు, వ్యక్తులు మొదట కేరింగ్స్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ 30 రోజుల్లోగా అప్‌లోడ్ చేయాలి.
- పోర్టల్‌లో దంపతులు, వ్యక్తులు తమ పేర్లు, పుట్టినతేదీ, కుటుంబ ఫొటో, జాతీయత, అడ్రస్, ఉద్యోగ, వ్యాపార వివరాలు, వార్షికాదాయం, పాన్, ఆధార్, పాస్‌పోర్టు నంబర్ల వివరాలు ఎంటర్ చేయాలి.
- మీరు దత్తత తీసుకోవాలనుకునేవారు అబ్బాయా... అమ్మాయా? ఏ వయసున్న పిల్లలు అవసరమో వెల్లడించాలి.
- దత్తత ఎందుకు తీసుకుంటున్నారో 200 పదాలకు మించకుండా కారణాలు రాయాలి.
- వివాహ ధ్రువీకరణ పత్రం, విడాకులు తీసుకుంటే డైవోర్స్ డిక్రీ, సింగిల్ పేరెంట్ అయితే బంధువుతో అండర్‌టేకింగ్, అప్పటికే కుటుంబంలో పిల్లలుంటే వారి సమ్మతిపత్రం తప్పనిసరిగా సమర్పించాలి.
- దరఖాస్తును పరిశీలించిన తర్వాత జిల్లా చిన్నారుల సంరక్షణ కమిటీ(డీసీపీయూ) లేదంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (ఎస్‌ఏఏ) అధికారులు 60 రోజుల్లోగా దరఖాస్తుదారుల వివరాలపై తనిఖీ చేసి, పోర్టల్‌లో ఎంటర్ చేస్తారు.
- వివరాలన్నీ సరిగా ఉంటే.. సీనియారిటీ ప్రకారం నిర్ణీత కాలవ్యవధి తర్వాత దత్తతకు సిద్ధంగా ఉన్న చిన్నారుల వివరాలు దంపతులకు ఆన్‌లైన్‌లో వస్తాయి.
- నెల రోజుల వ్యవధిలో కొంత కాలపరిమితి ఇస్తూ ముగ్గురు చిన్నారులను అధికారులు రిఫర్ చేస్తారు. అప్పుడు దంపతులు చిన్నారిని రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది.
- ఒకవేళ మొదట రిఫర్ చేసిన చిన్నారిని వద్దనుకుంటే.. మరో చిన్నారిని అధికారులు రిఫర్ చేస్తారు. ఇలా 3 రిఫరల్స్ తర్వాత సీనియారిటీ మళ్లీ మొదటికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
- చిన్నారిని ఎంపిక చేసుకున్న తర్వాత దత్తత కమిటీ సమావేశమై.. దంపతుల తాజా వైద్య రిపోర్టులు, ఆదాయ వివరాలు తీసుకుంటుంది.
- అప్పుడు దంపతులకు మరోసారి కౌన్సెలింగ్ చేసి, మినిట్స్ రూపొందిస్తారు.
- తర్వాత చిన్నారిని దంపతులకు ప్రీ అడాప్షన్ కింద ఫిజికల్ కస్టడీకి ఇస్తారు. అప్పుడు జిల్లా కలెక్టరు 60 రోజుల్లోగా దత్తత ఆదేశాలు జారీ చేస్తారని నిపుణులు పేర్కొన్నారు.
- దత్తత తీసుకున్నాక రెండేళ్ల వరకు జిల్లా చిన్నారుల సంరక్షణ కమిటీ(డీసీపీయూ) చిన్నారి వివరాల గురించి ఎప్పటికప్పుడు ఆరాతీసి, నివేదికలు ఇస్తుంది.
- కారాలో నమోదు చేసుకున్నాక వచ్చిన సీనియారిటీ, పిల్లల వయసు, ఆడ, మగ, ఆరోగ్యం, తదితరాలన్నీ పరిగణనలోకి తీసుకుంటే దత్తతకు కనీసం ఏడాది నుంచి మూడేళ్ల సమయం పడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.