Chhattisgarh Village Electricity :మన దేశానికి స్వాతంత్య్రం 1947లోనే వచ్చినా, ఆ ఊరిలో విద్యుత్ తొలి వెలుగులు మాత్రం 2025లోనే ప్రసరించాయి. ఔను - ఇది నిజమే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కేంద్రానికి 50 కి.మీ దూరంలోని మారుమూల గ్రామం చిల్కపల్లిలో ఎట్టకేలకు ఇప్పుడు విద్యుత్ పంపిణీ మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'నియాద్ నెల్లనార్ యోజన' అనే పథకం కింద ఈ ఊరిలో విద్యుద్దీకరణ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ స్కీం ద్వారా బీజాపూర్ జిల్లాలో విద్యుద్దీకరణను పూర్తి చేసుకున్న ఆరో గ్రామం చిల్కపల్లి. జనవరి 23 నాటికే ఈ ఊరిలో విద్యుత్ పంపిణీ లైన్ల ఏర్పాటు, ఇంటింటికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం వంటి పనులు పూర్తయ్యాయని బీజాపూర్ జిల్లా కలెక్టర్ సంబిత్ మిశ్రా వెల్లడించారు. సుదూరంగా ఉన్న ఈ పల్లెల్లో విద్యుత్ వెలుగులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. రాబోయే కొన్ని నెలల్లో జిల్లాలోని మరిన్ని మారుమూల గ్రామాల్లోనూ విద్యుద్దీకరణ పనులు పూర్తవుతాయన్నారు. సాధ్యమైనంత త్వరగా ఆ పనులన్నీ పూర్తయ్యేలా పర్యవేక్షిస్తానని కలెక్టర్ తెలిపారు.
ఇకపై రాత్రి కూడా మా పిల్లలు చదువుకోగలరు!
"ఇప్పటి వరకు మా ఊరు విద్యుత్‌ను చూడలేదు. ఇప్పుడు ఊరిలోని ప్రతీ ఇంట్లో విద్యుత్ వెలుగులు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం మా జీవితాలను మారుస్తుంది. రాత్రి టైంలో ఇక మా పిల్లలు చదువుకోగలరు. మేం వంటలు కూడా చేయగలం" అని చిల్కపల్లికి చెందిన ఓ గిరిజన మహిళ చెప్పుకొచ్చింది.