Major Stampede In India : గతంలోనూ వేర్వేరు ప్రాంతాల్లో కుంభమేళాతోపాటు పర్వదినాల సందర్భంగా పలు దుర్ఘటనలు జరిగాయి. వాటిలో వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది భక్తులు హాజరయ్యే వేడుకల ఏర్పాట్ల విషయంలో పాలకులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి. వదంతులు, భక్తుల్లో భయాలు ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
కుంభమేళాల్లో జరిగిన ఘటనలు
- దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1954లో తొలి కుంభమేళా జరిగింది. అప్పుడు ఫిబ్రవరి 3న జరిగిన తొక్కిసలాట దేశచరిత్రలో జరిగిన పెను విషాదాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఘటనలో 800 మంది ప్రాణాలు కోల్పోగా, 2 వేల మంది గాయపడ్డారు. అప్పుడు కూడా మౌనీ అమావాస్య రోజే ఆ దుర్ఘటన జరిగింది. ఓ ఏనుగు అదుపుతప్పి దూసుకురావడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
- 1986 ఏప్రిల్ 14న కుంభమేళాలో అప్పటి యూపీ సీఎం వీర్‌బహదూర్ సింగ్, పలు రాష్ట్రాల సీఎంలు, ఎంపీలతో కలిసి హరిద్వార్‌లో పుణ్యస్నానానికి వెళ్లారు. భక్తుల రద్దీని నియంత్రించ లేకపోవటం వల్ల తొక్కిసలాట జరిగింది. అప్పుడు 200 మంది మరణించారు.
- 2003లో మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన కుంభమేళా సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేయటానికి భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్లారు. అప్పుడు కూడా తొక్కిసలాట జరిగిన 39 మంది మృతి చెందారు.
- 2013లో అలహాబాద్‌లో జరిగిన కుంభమేళాలో ఫిబ్రవరి 10న తొక్కిసలాట జరిగింది. ఒక కాలినడక వంతెన కూలిపోవటం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 42 మంది మరణించారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో
- కుంభమేళాలే కాకుండా ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ తొక్కిసలాట ఘటనలు జరిగిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. గతేడాది జులైలో ఉత్తర్‌ప్రదేశ్ హాథ్రస్‌లో భోలేబాబా సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫుల్‌రాయ్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. బాబా పాదాల వద్ద మట్టి కోసం భక్తులు ఎగబడటం వల్ల తొక్కిసలాట జరిగింది.
- 2013 అక్టోబర్ 13న నవరాత్రుల సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రత్నఘడ్ మందిరంలో లక్షన్నర మందికిపైగా హాజరయ్యారు. ఓ వంతెన కూలిపోయే స్థితికి చేరిందనే వదంతులతో జనం పరుగులు తీశారు. ఈ సందర్భంగా తోపులాట జరిగి 115 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రాజస్థాన్‌లోని చాముండేశ్వరీ దేవి ఆలయంలో 2008 సెప్టెంబర్ 30న తొక్కిసలాట జరిగింది. 250 మంది మృతి చెందారు. 420 మందికిపైగా గాయపడ్డారు. బాంబు పేలుడు భయాలే ప్రమాదానికి కారణమనే కథనాలు వెలువడ్డాయి.
- 2008 ఆగస్టులో హిమాచల్‌ప్రదేశ్‌లోని నయనాదేవి ఆలయంలో తోపులాట జరిగి 162 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండచరియలు విరిగిపడుతున్నాయనే వదంతులతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.
- మహారాష్ట్రలోని మంధరదేవి ఆలయానికి 2005 జనవరిలో భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. ఆలయ మెట్లపై నుంచి జారి భక్తులు ఒకరిపైకి మరొకరుపడ్డారు. ఈ సందర్భంగా 340 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.