తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తొలి 'రైతు' ప్రధాని చౌధరీ చరణ్​ సింగ్- జమీందారీ చట్టం రద్దుకు ఎనలేని కృషి - bharat ratna 2024 list

Chaudhary Charan Singh Bharat Ratna : స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నాయకుడిగా గుర్తింపు పొందిన చౌధరీ చరణ్‌ సింగ్​కు భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ఆయన మరణానంతరం ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. రైతులు కోసం ఎన్నో పోరాటాలు చేశారు.

Chaudhary Charan Singh Bharat Ratna
Chaudhary Charan Singh Bharat Ratna

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 3:00 PM IST

Chaudhary Charan Singh Bharat Ratna : స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నాయకుడిగా గుర్తింపు పొందిన చౌధరీ చరణ్‌ సింగ్‌ దేశానికి ఐదవ ప్రధాన మంత్రిగా పనిచేశారు. రైతే దేశానికి వెన్నెముక లాంటివాడని నమ్మి అన్నదాతల పక్షాన ఎన్నో పోరాటాలకు చరణ్‌సింగ్ నేతృత్వం వహించారు. ఆయన చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దు అయ్యింది. కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టారు. చరణ్‌సింగ్‌ కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలోనే పొగాకు రైతులను వేధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేశారు. తాజాగా ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

తొలి రైతు ప్రధాని
Chaudhary Charan Singh Biography :ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన తొలి రైతు చౌధరీ చరణ్ సింగ్. 1979లో జులై 28 నుంచి 1980 జనవరి 14వ తేదీ వరకు దేశ ప్రధానిగా సేవలందించారు. ఈ కాలంలో భారత రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. 1902లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఆయన జన్మించారు. 1937లో తన 34వ ఏట ఉత్తరప్రదేశ్‌ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఛత్రౌలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1946, 1952, 1962, 1967లలో గెలుపొందారు. 1967, 1970లో రెండుసార్లు ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎంగా పనిచేశారు. భారతదేశ తొలి రైతు ప్రధానిగా చరణ్ సింగ్ పేరు గడించారు. వ్యవసాయ రంగం, రైతుల గురించి ఎంతగానో ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్‌ సింగ్‌ సేవలకు గుర్తుగా ప్రతి ఏడాది డిసెంబర్ 23న చరణ్‌ సింగ్‌ జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు.

జాతీయ స్థాయిలో పోరాటాలు
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో హోమ్, ఆర్ధిక శాఖల మంత్రిగా కూడా చరణ్ సింగ్ పనిచేశారు. ఏ పదవి చేపట్టినా గ్రామాలకు, రైతుల కోసం ఆరాట పడేవారు. భారత రాజకీయాలలో రైతుల సమస్యలే అజెండాగా మొదట ఉత్తర ప్రదేశ్ స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో అనేక పోరాటాలకు చరణ్‌సింగ్‌ నేతృత్వం వహించారు. బలమైన వ్యవసాయరంగం లేకుండా పారిశ్రామిక రంగం అభివృద్ధికి నోచుకోలేదని బలంగా వాదించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రైతుల పిల్లలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని 1939లోనే కాంగ్రెస్ పార్లమెంటరీ ప్యానల్ ముందు ప్రతిపాదన ఉంచారు. ఉత్తర ప్రదేశ్ వ్యవసాయ మంత్రిగా 1952లో తాను తీసుకొచ్చిన జమీందారీ, భూసంస్కరణల బిల్లు తన జీవితంలో సాధించిన గొప్ప విజయంగా చౌధరీ చరణ్‌సింగ్‌ చెప్పేవారు.

కౌలుదారీ చట్టం అమలు
కౌలుదారులకు భూములపై యాజమాన్య హక్కులు కలిగించిన ఈ చట్టం గ్రామీణ భారతంలో ఓ విప్లవానికి దారితీసింది. రైతుల కష్టం తెలుసుకున్న ఆయన అసెంబ్లీలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ బిల్లును ప్రవేశపెట్టారు. వ్యాపారులు, రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఈ బిల్లు ఉద్దేశం. తర్వాత చాలా రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయి. అలానే చరణ్​ సింగ్ చాలా పుస్తకాలు రాశారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో జైలుకు వెళ్లినప్పడు రెండు పుస్తకాలు రాశారు. 1987 మే 29 ఆయన మరణించారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న లభించింది.

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న- మరో ఇద్దరికి కూడా

దేశం ఆకలి తీర్చిన శాస్త్రవేత్త- హరిత విప్లవ పితామహుడికి భారత రత్న

ABOUT THE AUTHOR

...view details