తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగ్లాదేశ్​ పరిణామాలపై భారత్​ హైఅలర్ట్​- మోదీ నేతృత్వంలో కేబినెట్ మీటింగ్- హసీనాతో NSA భేటీ! - CCS Meeting - CCS MEETING

CCS Meeting On Bangladesh Situation : బంగ్లాదేశ్​లో అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఎస్‌) సోమవారం సమావేశమైంది. మంత్రులకు బంగ్లాలో పరిస్థితిని అధికారులు వివరించారు. మరోవైపు బంగ్లాదేశ్​ సరిహద్దులో ఉన్న రాష్ట్రాలు హైఅలర్ట్​ ప్రకటించాయి.

CCS Meeting On Bangladesh Situation
CCS Meeting On Bangladesh Situation (ANI, AP, AFP)

By ETV Bharat Telugu Team

Published : Aug 5, 2024, 10:21 PM IST

CCS Meeting On Bangladesh Situation :బంగ్లాదేశ్​లో కల్లోల పరిస్థితి నెలకొన్న వేళ భారత్​ అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సోమవారం రాత్రి భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ(సీసీఎస్‌) సమావేశం జరిగింది. ఈ మీటింగ్​లో హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. వీరందరికి సీనియర్ అధికారులు బంగ్లాలో పరిస్థితిని వివరించారు. అంతకుముందు బంగ్లా తాజా పరిస్థితిపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్​ జై శంకర్ సోమవారం వివరించినట్లు సమాచారం.

అంతకుముందు, బంగ్లాదేశ్‌ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్‌ హసీనా భారత్‌కు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం 5.36 గంటలకు ఆమె దిల్లీలో దిగారు. బంగ్లాదేశ్‌ వైమానికి దళానికి చెందిన విమానం లాక్‌హీడ్‌ C-130J హెర్క్యులస్‌లో ప్రయాణించిన ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌ గాజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌ బేస్‌లో దిగారు. ఈ క్రమంలో హసీనాతో, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్​ సమావేశమైనట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్ వైఖరిని తెలియజేసినట్లు తెలుస్తోంది.

బంగ్లా సరిహద్దు రాష్ట్రాల్లో హైఅలర్ట్​
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మేఘాలయాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు మేఘాలయ డిప్యూటీ సీఎం ప్రిస్టోన్ టైన్‌సాంగ్ వివరాలు వెల్లడించారు. "ఈరోజు(సోమవారం) సాయంత్రం, బంగ్లాదేశ్​లో పరిస్థితిని చూసి నేను అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశాను. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, DGP, BSF IG ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ రాత్రి నుంచి బంగ్లాదేశ్‌తో అంతర్జాతీయ సరిహద్దులో కర్ఫ్యూ విధించాలని నిర్ణయించాం. ఈ కర్ఫ్యూ జీరో పాయింట్ నుంచి లేదా అంతర్జాతీయ సరిహద్దు స్తంభం నుంచి భారత భూభాగం లోపల 200 మీటర్ల వరకు ప్రతిరోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల అమలు చేస్తాం." అని తెలిపారు. మేఘాలయ మాత్రమే కాకుండా, బంగాల్​, అసోం సరిహద్దుల్లో కూడా హైఅలర్ట్​ ప్రకటించారు.

ఎల్​ఐసీ ఆఫీస్​ క్లోజ్​
బంగ్లాదేశ్​లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా అక్కడ ఉన్న తమ కార్యాలయాలు ఆగస్టు 7 వరకు మూతపడతాయని లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్​ఐసీ) సోమవారం తెలిపింది.

బంగ్లాకు విమాన, రైళ్ల సర్వీసులు రద్దు
బంగ్లాదేశ్‌లో ఉద్రికత్తలు హింసాత్మకంగా మారడంతో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకొంది. ఆ దేశానికి విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. అదే విధంగా భారత్‌ నుంచి బంగ్లాకు రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా, కోల్​కతా-ఢాకా మైత్రి ఎక్స్​ప్రెస్ మంగళవారం రద్దు చేస్తున్నట్లు ఈస్టర్న్​ రైల్వే ప్రకటించింది. అయితే ఈ రైలు సేవలు జులై 19నుంచి అందుబాటులో లేవు. బంగ్లాలో తాజా పరిస్థితి నేపథ్యంలో ఆగస్టు 6వరకు కూడా సేవలు రద్దు చేస్టున్నట్లు రైల్వే వెల్లడించింది.

వాణిజ్యంపై ఎఫెక్ట్​
బంగ్లాదేశ్​లో కల్లోల పరిస్థితితో ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై కూడా చాలా ప్రభావం పడింది. ఆదివారం బంగ్లా ప్రభుత్వం అత్యవసర సేవలు, తప్ప మూడు రోజులు ట్రేడ్​ హాలీడే ప్రకటించింది. ఈ నేపథ్యంలో బంగ్లా పోర్టుల్లో కస్టమ్స్​ క్లియరెన్స్​ లేక ఎగుమతి, దిగుమతి స్తంభించిపోయిందని బంగాల్​ ఎక్స్పోర్టర్స్​ కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి ఉజ్జల్​ సాహా తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details