తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jul 17, 2024, 5:54 PM IST

ETV Bharat / bharat

ఇకపై ఏడాదికి రెండుసార్లు CBSE బోర్డ్ ఎగ్జామ్స్‌‌!- ఒకటి మార్చిలో, రెండోది జూన్‌లో!! - cbse two board exams

CBSE Two Board Exams : 10, 12 తరగతుల విద్యార్థులకు సంవత్సరానికి రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణపై సీబీఎస్‌‌ఈ కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఏటా రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించాలనే పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏటా రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్ కోసం షెడ్యూల్‌ను నిర్ణయించడం తమకు పెద్ద సవాల్ అవుతుందని సీబీఎస్‌ఈ అధికార వర్గాలు అంటున్నాయి.

CBSE Two Board Exams :
CBSE Two Board Exams : (ANI)

CBSE Two Board Exams :వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటా రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించే అంశంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తీవ్ర కసరత్తు చేస్తోంది. రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలంటూ నూతన నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌సీఎఫ్) చేసిన సిఫార్సులను ఎలా అమలు చేయాలో అర్థం కాక సీబీఎస్‌ఈ అయోమయంలో ఉంది. విభిన్న వాతావరణ పరిస్థితులు, భౌగోళిక వైరుధ్యాలు కలిగిన మన దేశంలో ఈ ప్రతిపాదన అమలు అంత సులభం కాదని సీబీఎస్ఈ అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పరీక్షలను సెమిస్టర్​ విధానంలో నిర్వహించడంపైనా చర్చించినట్లు సీబీఎస్​ఈ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటుగా జనవరి-ఫిబ్రవరిలో సీబీఎస్‌‌ఈ మొదటి బోర్డ్ ఎగ్జామ్‌ను నిర్వహించి, మార్చి-ఏప్రిల్ లేదా జూన్‌లో రెండో బోర్డ్ ఎగ్జామ్‌ను నిర్వహించేందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇవి ఫైనల్ ప్రతిపాదన కాదని, చర్చలు చేసే క్రమంలో మరిన్ని కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఒకసారి ఎగ్జామ్స్‌కే పెద్ద ప్రాసెస్, ఇక రెండోది అంటే
ఏడాదికి రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఇటీవల సీబీఎస్‌ఈ అధికార వర్గాలు కేంద్ర విద్యాశాఖకు ప్రజెంటేషన్ ఇచ్చాయి. ఏడాదికి ఒకసారి పదోతరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణకు సీబీఎస్‌ఈ ప్రస్తుతం 150 కంటే ఎక్కువ దశలను పూర్తి చేయాల్సి వస్తోందని కేంద్ర విద్యాశాఖకు సీబీఎస్‌ఈ అధికారులు తెలిపారు. "ఈ బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహణ ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల జాబితా తయారీ, సెంటర్ నోటిఫికేషన్లు విడుదల చేయడం, రోల్ నంబర్ల విడుదల, ప్రాక్టికల్స్ నిర్వహణ, థియరీ పరీక్షలు, ఫలితాల ప్రకటన, ధ్రువీకరణ, రీవాల్యుయేషన్ వంటివన్నీ పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి దాదాపు 310 రోజుల సమయం పడుతుంది. పదోతరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను కనీసం 55 రోజుల పాటు నిర్వహించాల్సి ఉంటుంది'' అని కేంద్రానికి వివరించారు. ఒకసారి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తేనే ఇంత ప్రక్రియ ఉంటే ఏడాదికి రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలంటే ఇంకా పెద్ద ప్రక్రియను పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి సీబీఎస్‌ఈ తెలిపింది. మొదటి రౌండ్ బోర్డు పరీక్షలు పూర్తయిన వెంటనే, రెండో రౌండ్ బోర్డ్ ఎగ్జామ్స్‌ను నిర్వహించే ప్రక్రియను మొదలుపెట్టాల్సి ఉంటుందని, అది చాలా కష్టమని సీబీఎస్ఈ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వాతావరణ మార్పులు సైతం
ఒకవేళ ఫిబ్రవరి కంటే ముందు బోర్డ్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని భావిస్తే ఆ సమయంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన చలి ఉంటుంది. అది విద్యార్థులకు చాలా ప్రతికూలమైన సమయమని సీబీఎస్‌ఈ వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ''ఏటా మొదటిసారి బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించాక, రెండోసారి నిర్వహించేందుకు కొంత గ్యాప్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వ్యవధిలో రెండో విడత బోర్డ్ ఎగ్జామ్ కోసం సీబీఎస్‌ఈ ప్రిపరేషన్, ప్లానింగ్ చేసుకుంటుంది. రెండో సారి బోర్డ్ ఎగ్జామ్ కోసం మార్చి-ఏప్రిల్‌ను ఎంపిక చేసుకోవాలా? లేదా జూన్‌‌ను ఎంపిక చేసుకోవాలా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు'' అని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రెండుసార్లూ రాయాల్సిన అవసరం లేదు
వాస్తవానికి 2024- 25 విద్యా సంవత్సరం నుంచే ఏటా రెండుసార్లు సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని కేంద్ర విద్యాశాఖ భావించింది. కానీ వెంటనే ఆ ప్రణాళిక అమలు సాధ్యపడదని సీబీఎస్‌ఈ తేల్చి చెప్పడం వల్ల ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏటా రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలనే పట్టుదలతో కేంద్ర సర్కారు ఉంది. అయితే విద్యార్థులు రెండుసార్లు బోర్డ్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. వారికి మొదటిసారే ఎక్కువ మార్కులు వస్తే అంతటితో ఆగిపోవచ్చు. ఒకవేళ మొదటిసారి తక్కువగా వస్తే రెండోసారి రాయొచ్చు. రెండోసారి బోర్డ్ ఎగ్జామ్ నిర్వహించే సమయంలోనే ఇంప్రూవ్‌మెంట్/సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. సీబీఎస్‌ఈ ఉన్నతాధికారులు ముమ్మర కసరత్తు తర్వాత ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారు ? వాటిపై కేంద్రం ఎలా స్పందిస్తుంది? అనేది వేచిచూడాలి.

ABOUT THE AUTHOR

...view details