Jammu Kashmir Second Phase Election : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు వేళైంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్, బుద్గాం, రాజౌరి, పూంచ్, గందర్‌బల్, రియాసి జిల్లాల్లోని 26 స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, బీజేపీ జమ్ముకశ్మీర్ చీఫ్ రవిందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
గందర్‌బల్, బుద్గాం స్థానాల్లో ఒమర్ అబ్దుల్లా పోటీలో ఉన్నారు. సెంట్రల్ షాల్టెంగ్ నియోజకవర్గంలో హమీద్ కర్రా, నౌషెరా స్థానంలో రవిందర్ రైనా బరిలో నిలిచారు. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. మొత్తం 3502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది. వాటిలో 1,056 పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో, 2,446 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఎన్నికల్లో పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
J&K gears up for phase-2 elections, polling officials take up positions in six districts
— PTI News Alerts (@PTI_NewsAlerts) September 24, 2024
Edited video is available on PTI Videos (https://t.co/L2D7HH309u) #PTINewsAlerts #PTIVideos @PTI_News pic.twitter.com/1sK8CrZmge
జైలు నుంచి వేర్పాటువాద నేత పోటీ
ఈ దఫా ఎన్నికల్లో బీర్వా, గందర్‌బల్ సెగ్మెంట్లపై ఆసక్తి నెలకొంది. జైలులో ఉన్న వేర్పాటువాద నాయకుడు సర్జన్ అహ్మద్ వాగే అలియాస్ బర్కతి- ఈ రెండు చోట్ల నుంచి పోటీ చేయడమే అందుకు కారణం. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గంలో ఒమర్ అబ్దుల్లాను రెండు లక్షలకుపైగా మెజార్టీతో ఓడించిన ఇంజినీర్ రషీద్ ఫీట్‌ను పునరావృతం చేయాలని బర్కతి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంజినీర్ రషీద్ తిహాడ్ జైలు నుంచి పోటీ చేసి బారాముల్లాలో విజయం సాధించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గందర్‌బల్ నియోజకవర్గంలో ఒమర్ అబ్దుల్లాను ఓడించాలని బర్కతి భావిస్తున్నారు.
శ్రీనగర్ జిల్లాలో పోలింగ్ జరగనున్న 8 అసెంబ్లీ స్థానాల్లో 93 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బుద్గాం జిల్లాలోని ఐదు స్థానాల్లో 46 మంది, రాజౌరి జిల్లాలోని ఐదు స్థానాల్లో 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పూంచ్ జిల్లాలో మూడు స్థానాలకు 25మంది అభ్యర్థులు, గందర్‌బల్ జిల్లాలో రెండు స్థానాలకు 21 మంది, రియాసి జిల్లాలో మూడు స్థానాలకు 20 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
రెండో విడత పోలింగ్ దృష్ట్యా రాజౌరీ సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికలు జరగనున్న 6 జిల్లాల సరిహద్దుల్లో నిఘా పెంచారు. జమ్ముకశ్మీర్‌లో సెప్టెంబర్ 18న 24 నియోజకవర్గాలకు జరిగిన తొలి విడత పోలింగ్‌లో 61.38 శాతం ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న చివరిదైన మూడో విడత పోలింగ్‌లో మిగిలిన 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపడతారు.