Woman Files Rape Case on youtuber Harsha Sai : ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్నచిత్రాలు సేకరించి బ్లాయిమెయిల్ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నగ్న వీడియోలు సేకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొందని వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : సినిమాల్లో అవకాశాల కోసం ముంబయికి చెందిన యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఒక సినిమాలోనూ నటించింది. గతంలో ఒక రియాల్టీ షోలో పాల్గొంది. ఓ ప్రైవేటు పార్టీలో హర్షసాయి తనను కలిశాడని అప్పటి నుంచి ఇద్దరి స్నేహం మొదలైందని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది.
ఈ మేరకు కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. యువతిని వైద్యపరీక్షల నిమిత్తం కొండాపూర్‌లోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. యువతి హర్షసాయి తండ్రిపై కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా ఏపీలోని విశాఖకు చెందిన హర్షసాయి యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుంటాడు. అతని ఛానెల్‌ను మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. పేదలకు ఆర్ధిక సాయం చేస్తూ అనేక వీడియోలు తన ఛానెల్లో అప్లోడ్ చేస్తుంటాడు. హర్షసాయి హీరోగా బాధిత యువతి హీరోయిన్‌గా గతంలో ఒక సినిమాను ప్రారంభించారు.
నటి ఆరోపణలపై స్పందించిన హర్షసాయి : తాజాగా ఆమె ఆరోపణలను ఉద్దేశించి యూట్యూబర్ హర్షసాయి స్పందించారు. ఈ మేరకు ఆయన తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ పెట్టారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని తేల్చిచెప్పారు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. తన గురించి అందరకీ తెలుసని పేర్కొన్నారు. త్వరలోనే నిజం బయటకు వస్తుంది ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తన తరఫు న్యాయవాది చూసుకుంటారని వెల్లడించారు.
''ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారు. మీకు నా గురించి తెలుసు. త్వరలోనే నిజం బయటకు వస్తుంది’’. ఈ విషయాన్ని నా తరఫు న్యాయవాది చూసుకుంటారు''- హర్షసాయి, యూట్యూబర్
ఇటీవలే యూట్యూబర్ హర్షసాయి 'మెగా' అనే మూవీలో హీరోగా నటించారు. 2023లో టీజర్ రిలీజ్ అయినా ఇప్పటిి వరకు సినిమా రిలీజ్ ఎప్పుడో ప్రకటించలేదు. తాజాగా ఆయనపై అత్యాచారం కేసు నమోదు కావడంతో తన అభిమానులతోపాటు పలవురు యూట్యూబర్లు సైతం షాక్‌కు గురయ్యారు.