Kolkata Doctor Case CBI Charget Sheet :దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీకర్ జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సీబీఐ కీలక సాక్ష్యాలను పొందుపర్చింది. డీఎన్ఏ, రక్తపు నమూనాలు సహా 11 రుజువులను అందులో ప్రస్తావించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సివిక్ వాలంటీర్ సంజయ్‌రాయ్‌కు సంబంధించిన డీఎన్ఏ మృతిచెందిన వైద్యురాలి శరీరంపై లభ్యమైనట్లు అభియోగపత్రంలో సీబీఐ పేర్కొంది. ఘటనాస్థలంలో లభ్యమైన వెంట్రుకలు, బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నిందితుడివేనని తెలిపింది. మృతురాలి రక్త నమూనాలు సంజయ్‌రాయ్ దుస్తులు, చెప్పులపై లభ్యమైనట్లు రుజువులను అభియోగపత్రంలో పేర్కొంది.
ఆ నమునాలు నిందితుడివే
ఆర్జీ కర్ ఆస్పత్రిలో ఆగస్టు 9వ తేదీన ఈ హత్యాచార జరగగా, నిందితుడు సంజయ్‌రాయ్‌ను ఆగస్టు 10వ తేదీన కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు 8, 9 తేదీల్లో సంజయ్‌రాయ్ ఆస్పత్రిలోనే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా సాక్ష్యాలుగా సీబీఐ సమర్పించింది. మృతురాలి రక్త నమూనాలు నిందితుడు సంజయ్‌రాయ్ జీన్స్, చెప్పులపై లభ్యమైనట్లు తెలిపింది. నిందితుడి దుస్తులు, ఫుట్‌వేర్‌ను ఆగస్టు 12వ తేదీన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలిలో లభ్యమైన వెంట్రుకలు నిందితుడు సంజయ్‌రాయ్‌తో సరిపోలినట్లు సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా హత్యాచార ఘటనలో బాధితురాలు ప్రతిఘటించగా నిందితుడు సంజయ్‌రాయ్‌కు కొన్ని గాయాలయ్యాయి. వాటిని కూడా రుజువులుగా ఛార్జిషీట్‌లో తెలిపింది.