National Health Mission Extend :జాతీయ ఆరోగ్య మిషన్‌ను మరో ఐదేళ్లపాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు ఆమోదం లభించింది. మరోవైపు ముడి జనపనార కనీస మద్దతు ధరను క్వింటాకు రూ. 315 మేర కేంద్ర మంత్రివర్గం పెంచింది. ఈ విషయాన్ని కేబినెట్ సమావేశం తర్వాత కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ వెల్లడించారు.
'జాతీయ ఆరోగ్య మిషన్' మరో ఐదేళ్లు పొడిగింపు - NATIONAL HEALTH MISSION
జాతీయ ఆరోగ్య మిషన్ మరో ఐదేళ్లు కొనసాగింపు- ముడి జనుము ఎంఎస్‌పీ 6 శాతం పెంపు- ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Published : Jan 22, 2025, 3:46 PM IST
జాతీయ ఆరోగ్య మిషన్ వల్ల గత పదేళ్లలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రయోజనం పొందారని పీయూశ్ గోయల్ అన్నారు. 2021-2022 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు ఎన్‌హెచ్‌ఎంలో చేరారని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా కరోనా మహమ్మారిపై తిరుగులేని పోరాటం చేశామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) కోసం ముడి జనపనారకు కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను 6 శాతం (రూ.315) మేర పెంచే ప్రతిపాదనను కేబినెట్ సమావేశంలో ఆమోదించినట్లు పీయూశ్ గోయల్ వెల్లడించారు. దీంతో ముడి జనపనారకు క్వింటా ధర రూ.5,650కు చేరుతుందన్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరం నాటికి ముడి జనుము ధర క్వింటాలుకు రూ.2,400 మాత్రమే ఉండేదని మంత్రి పీయూష్ గోయల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత పదేళ్లలో ముడి జనుము ధర దాదాపు 2.35 రెట్లు పెరిగిందన్నారు. తాజాగా ఎంఎస్‌పీ పెంపుతో దేశవ్యాప్తంగా ఎంతోమంది జనుము రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. జనుము రైతులకు ఉత్పత్తి వ్యయంపై సగటున 66.8 శాతం మేర లాభం వస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.