Building Collapse Meerut :ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో మూడంతస్తుల భవనం కూలి 10 మంది మృతి చెందారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుని గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు చనిపోవడం వల్ల ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగిందంటే?
అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, లోహియానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకీర్ కాలనీలో నఫో అనే వృద్ధురాలికి మూడంతస్తుల ఇల్లు ఉంది. 50 ఏళ్ల క్రితానికి చెందిన ఆ ఇంటికి సరైన రీతిలో మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల శిథిలావస్థకు చేరుకుంది. వర్షం కారణంగా శనివారం సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.
భారీగా వర్షం కురుస్తున్నా సహాయక చర్యలు
ప్రమాదంపై సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక అధికారులు ఘటనాస్థలి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యులు ప్రారంభించారు. SDRF, NDRF బృందాలు ముమ్మర చర్యలు చేపట్టాయి. భారీ వర్షం కురుస్తున్న సహాయక చర్యలను నిరాటంకంగా నిర్వహించాయి. మొత్తం శిథిలాల కింద ఉన్న 15 మందిని బయటకు తీసుకొచ్చారు అధికారులు. అందులో 10మంది చనిపోయినట్లు గుర్తించారు.
అనేక పశువులు కూడా మృతి
తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డ మిగతా ఐదుగురిని వెంటనే స్థానిక ఆస్పత్రికి చికిత్స కోసం తరిలించారు. సాజిద్ (40), సాజిద్ కుమార్తె సానియా (15), ఏడాదిన్నర బాలిక సిమ్రా సహా పలువురు మృతి చెందినట్లు గుర్తించారు. ఇంటి కింద భాగంలో ఉన్న పశువులు కూడా చనిపోయినట్లు తెలిపారు. బాధితులు, తమ ఇంట్లో పాల డెయిరీ నిర్వహించేవారని చెప్పారు. ఆ ప్రాంతాన్ని ప్రస్తుతం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
కొన్నిరోజుల క్రితం, మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో మట్టి గోడ కూలి తొమ్మిది మంది చిన్నారులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. షాపుర్‌కు చెందిన కొందరు చిన్నారులు శివలింగం చేసేందుకు స్థానిక ఆలయం వద్దకు వెళ్లారు. ఓ గోడ వద్ద కూర్చుని శివలింగం తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిముద్దైన గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడిపోయింది. దీంతో అంతా మట్టి కింద చిక్కుకున్నారు. గమనించిన స్థానికులు చిన్నారులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. వెంటనే చిన్నారులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో వైద్యులు ఎవరూ లేరని స్థానికులు ఆరోపించారు. పిల్లలకు తక్షణ చికిత్స అందక చిన్నారులు మృతి చెందారని చెప్పారు.