ADR Report On Regional Parties Income :మనదేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆర్థిక స్థితిగతులపై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికను విడుదల చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రాంతీయ పార్టీల ఆదాయ జాబితాలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మొదటిస్థానంలో నిలిచింది. ఆ సంవత్సరంలో బీఆర్ఎస్‌కు రూ. 737.67 కోట్ల ఆదాయం వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించిన 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 42.38 శాతానికి సమానం.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం విషయంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెండో స్థానంలో నిలిచింది. ఆ పార్టీకి రూ. 333.45 కోట్ల(19.16 శాతం) ఆదాయం వచ్చింది. డీఎంకేకు రూ. 214.35 కోట్ల (12.32 శాతం) ఆదాయం వచ్చింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 57 ప్రాంతీయ పార్టీలకుగానూ 39 పార్టీలు వివరణాత్మక ఆదాయ, వ్యయ నివేదికలను సమర్పించాయి. ఈ జాబితాలో టాప్-5 స్థానాల్లో నిలిచిన పార్టీలు రూ.1,541.32 కోట్ల ఆదాయాన్ని గడించాయి. ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో ఇది 88.56 శాతానికి సమానం. ఇక 39 ప్రాంతీయ పార్టీల మొత్తం ప్రకటిత ఆదాయం రూ.1,740.48 కోట్లు.
ఖర్చు చేయడంలో టాప్-5 పార్టీలివీ!
2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యయాల విషయానికొస్తే, అత్యధికంగా ఖర్చు చేసిన టాప్- 5 పార్టీల లిస్టులో మొదటి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీ రూ.181.18 కోట్లు ఖర్చు చేసింది. ఇది దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల మొత్తం ఖర్చులో 37.66 శాతానికి సమానం. రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ రూ. 79.32 కోట్ల (16.49 శాతం) ఖర్చు చేసింది. మూడో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ రూ. 57.47 కోట్లు (11.94 శాతం) ఖర్చు చేసింది. నాలుగో స్థానంలో నిలిచిన డీఎంకే రూ.52.62 కోట్లు(10.94 శాతం), ఐదో స్థానంలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ రూ.31.41 కోట్లు(6.53 శాతం) ఖర్చు చేసింది.