Prashant Kishor Arrested :బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్ష పేపర్ లీక్‌కు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్‌ను పాట్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాట్నాలో పీకే దీక్ష చేస్తున్న గాంధీ మైదాన్‌కు సోమవారం తెల్లవారుజామున పెద్దఎత్తున పోలీసులు చేరుకున్నారు. ఆయనతో పాటు నిరసనకారులను అందరినీ అదుపులోకి తీసుకొని దీక్షా స్థలాన్ని ఖాళీ చేయించారు. అత్యవసర చికిత్సను అందించేందుకుగాను ప్రశాంత్ కిశోర్‌ను పోలీసులు అంబులెన్స్‌లో తరలించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'బీపీఎస్సీలో జరుగుతున్న అవకతవకలపై తమ పార్టీ జనవరి 7న హైకోర్టులో పిటిషన్ వేస్తుంది. ఈ దీక్షను కొనసాగిస్తామా లేదా అన్నది తమకు ముఖ్యం కానే కాదు, బీపీఎస్సీ అవకతవకల అంశంపై పోరాటాన్ని కొనసాగించడం మాత్రమే మాకు ముఖ్యం' అన్నారు. బీపీఎస్సీలో జరుగుతున్న అవకతవకలపై తమ పోరాట పథాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
పోలీసులతో ఘర్షణ
ప్రశాంత్ కిశోర్‌ను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన అభిమానులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి పోలీసులు వారిని నిలువరించారు.
తేజస్వి వస్తే పక్కకు తప్పుకుంటా: పీకే
అంతకుముందు ఆదివారం రోజు ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నిరసన ఉద్యమాన్ని లీడ్ చేయాలని ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్‌కు పిలుపునిచ్చారు. బిహార్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్న తేజస్విని పెద్ద నాయకుడిగా అభివర్ణించారు. ఆయన వచ్చి నిరసనలను లీడ్ చేస్తానంటే, పక్కకు తప్పుకునేందుకు తాను సిద్ధమని పీకే చెప్పారు. రాష్ట్రంలో విపక్ష నేతగా ఉన్న తేజస్వి బాధ్యతాయుతంగా, స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీపీఎస్సీ అవకతవకలపై పోరాటానికి సారథ్యం వహించి ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘మేం ఏ పార్టీ బ్యానర్ లేకుండా ఈ ఉద్యమం చేస్తున్నాం. ఎవరైనా వచ్చి విద్యార్థులు, యువత కోసం మాట్లాడొచ్చు’’ అని పీకే తెలిపారు. ‘‘ఇది ధర్నా కాదు. బిహార్ ప్రజలు తమ పరిస్థితులను మెరుగుపర్చుకోవడం కోసం, మంచి భవిష్యత్తును నిర్మించుకోవడం కోసం చేస్తున్న ఉద్యమం’’ అని ఆయన పేర్కొన్నారు.
నిరసనల్లో బీజేపీ బీ టీమ్: తేజస్వి
శనివారం రోజు ఇదే అంశంపై ఆర్‌జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ స్పందిస్తూ, బీపీఎస్సీ నిరసనల అంశాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. విద్యార్థుల స్వతంత్ర ఉద్యమానికి రాజకీయ రంగులు అద్దారని మండిపడ్డారు. ఆ నిరసనల్లో చేరిన వారిలో బీజేపీకి చెందిన బీ టీమ్ ఉందన్నారు. బీజేపీ బీ టీమ్‌ను గుర్తించాలని బిహార్ ప్రజలను తేజస్వి కోరారు. ‘‘యువత చేస్తున్న బీపీఎస్సీ ఉద్యమాన్ని అంతం చేసే కుట్ర జరిగింది. వ్యానిటీ వ్యాన్‌లో నటులు కూర్చుంటున్నారు. నిర్మాత, దర్శకుడు వారిని అందులో కూర్చోబెడుతున్నారు. నిర్మాత ఎవరో మాకు తెలుసు. దర్శకుడు, నటుడిని ఎందుకు కూర్చోబెట్టారో అందరికీ తెలుసు’’ అని ఆయన కామెంట్ చేశారు. కాగా, డిసెంబర్ 13న బీపీఎస్సీ నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కంబైన్డ్ (ప్రిలిమినరీ) పోటీ పరీక్ష (CCE) 2024ని రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.