Blood Donation Camp At Wedding In Bihar: సాధారణంగా పెళ్లి వేడుకలు అంటే బంధుమిత్రులను పిలిచి విందు, డీజే డ్యాన్స్‌లతో కోలాహలంగా జరుపుకుంటారు. జీవితాంతం గుర్తుండిపోయేలా రూ.లక్షలు ఖర్చు పెట్టి మరీ గ్రాండ్‌గా వివాహం చేసుకుంటారు. అయితే బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి రోజున వినూత్నమైన పని చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
70 మంది రక్తదానం
ఔరంగాబాద్ జిల్లాలోని హస్పురా గ్రామానికి చెందిన అనీశ్ కేశరి, ఆరా ప్రాంతానికి చెందిన స్రిమాన్ కేశరి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. అయితే వరుడు అనీశ్ తన పెళ్లి రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను ఏర్పాటు చేయాలని వధువు కుటుంబాన్ని అడిగాడు. అతడు కోరినట్టే వివాహం రోజున మండపం దగ్గరే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు వధువు కుటుంబీకులు. వధూవరులతో పాటు పెళ్లికి హజరైన వారితో కలిపి 70 మంది వరకు రక్తదానం చేశారు. పెళ్లి రోజున చేసిన రక్తదానం తనకు 14వ సారి అని అనీశ్ తెలిపాడు.