తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మ్యాజిక్​ ఫిగర్​ను​ క్రాస్​ చేసిన NDA- మూడోసారి ప్రధానిగా మోదీ - Lok Sabha Election result 2024 - LOK SABHA ELECTION RESULT 2024

BJP Won In Lok Sabha Election 2024 : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని ఖావడం ఖాయమైంది. తద్వారా ఆయన తొలి ప్రధాని నెహ్రూ రికార్డు సమం చేయనున్నారు. అయితే ఎన్​డీఏకు 400స్థానాలకుపైగా వస్తాయని సాధిస్తుందని బీజేపీ వేసుకున్న అంచనాలు తప్పాయి. మిత్రపక్షాల సాయంతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్​డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షాలు కీలకం కానున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలకు మించి ఇండియా కూటమి సత్తా చాటింది. యూపీ, మహారాష్ట్ర, బంగాల్‌లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది.

BJP Won In Lok Sabha Election 2024
BJP Won In Lok Sabha Election 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 9:41 PM IST

BJP Won In Lok Sabha Election 2024 :సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి 292 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 240, తెలుగుదేశం 16, జేడీయూ 12, శివసేన శిందే వర్గం 7, ఎల్జేపీ రామ్‌విలాస్ పాశ్వాన్‌ వర్గం 5, జనసేన 2, జేడీఎస్‌ 2, ఆరెల్డీ 2 సీట్లలో విజయం సాధించాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 99, సమాజ్‌వాదీ 37, తృణమూల్ కాంగ్రెస్‌ 29, డీఎంకే 22, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 9, ఎన్సీపీ శరద్‌పవార్ వర్గం 7, ఆర్జేడీకి 4, సీపీఎం 4, ఆమ్‌ ఆద్మీ పార్టీ 4 స్థానాలు గెలిచాయి. లోక్‌సభ ఎన్నికల్లో NDA కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైనప్పటికీ ప్రతిపక్ష కూటమికి NDAకు మధ్య సీట్ల సంఖ్యలో అంతరం తక్కువగానే ఉంది. మూడోసారి మోదీ సర్కార్ కొలువు దీరడానికి మిత్రపక్షాలపై బీజేపీ ఆధారపడాల్సి ఉంది. ఈసారి బలమైన ప్రతిపక్షంతో కేంద్రంలో ప్రభుత్వానికి చిక్కులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు ఉన్న ఉత్తర్‌ ప్రదేశ్‌లో బీజేపీ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ జరిగింది. 80 స్థానాలు మావే అనుకుంటే ప్రతిపక్ష కూటమి అంతతేలిగ్గా వదల్లేదు. బీజేపీ 37 చోట్లే గెలవగా ఇండియా కూటమి 42 స్థానాలను కైవసం చేసుకుంది. 48 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి అనుకున్న రీతిలో ప్రజల మద్దతు కూడగట్టలేకపోయింది. శివసేన, NCP చీలిక పార్టీలతో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ కూటమి కంటే శివసేన ఉద్దవ్ వర్గం, శరద్‌ పవార్ ఎన్సీపీ పార్టీతో కలిసి కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన మహావికాస్ అఘాడీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్రలో ఎన్​డీఏ 17, ఇండియా కూటమి 30 చోట్ల గెలిచాయి.

రాజస్థాన్‌లోనూ బీజేపీ ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. ఇటీవలే రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కమలదళం 25 లోక్‌సభ స్థానాలకుగాను 14 చోట్లే గెలిచింది. 10 చోట్ల ఇండియా కూటమి గెలిచి పట్టు నిలుపుకుంది. బంగాల్‌లో తృణమూల్‌ను గట్టి దెబ్బకొట్టాలని భావించిన కమలదళం ఎన్నికల్లో గట్టి అభ్యర్థులనే నిలిపింది. మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమాను కనబరిచింది. కానీ అధికార టీఎంసీ బీజేపీని గట్టిగానే నిలువరించింది. 29 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 12 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక చోట విజయం సాధించింది. గతంలో సత్తాచాటని

దక్షిణాదిలోనూ ఈసారి మెరుగైన స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తంచేసిన బీజేపీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తమిళనాట బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. తమిళనాడులో 39కి ఇండియా కూటమి 38 స్థానాల్లో విజయం సాధించింది. కేరళలో మాత్రం బీజేపీ ఒక స్థానం గెలుచుకుంది. ఇండియా కూటమి 18 సీట్లలో విజయం సాధించింది. ఇతరులు ఒక చోట గెలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్​డీయే మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. ఒడిశాలో అనుకున్న ఫలితాలు రాబట్టడంలో బీజేపీ సఫలమైంది. ఒడిశాలో 79 స్థానాలు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తోంది. 21 లోక్‌సభ స్థానాల్లో 19 చోట్ల ఆధిక్యంలో నిలిచి అధికార బీజేడీని బీజేపీ పెద్ద దెబ్బకొట్టింది. లోక్‌సభలో 543 స్థానాలు ఉండగా సూరత్‌ లోక్‌సభ స్థానం భాజపాకు ఏకగ్రీవమైంది. ఫలితంగా 542లోక్‌సభ స్థానాలకే పోలింగ్ నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details