One Nation One Election Bill Committee :జమిలి ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి రాజస్థాన్ ఎంపీ పీపీ చౌధరి నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారని లోక్‌సభ సచివాలయం శుక్రవారం రాత్రి వెల్లడించింది. వృత్తి రీత్యా న్యాయవాది అయిన పీపీ చౌధరి రాజస్థాన్‌లోని పాళి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2025 బడ్జెట్ సమావేశాల చివరి వారం తొలిరోజు తన నివేదికను జేపీసీ పార్లమెంటుకు సమర్పించాలని గడువు విధించారు.
జమిలి ఎన్నికల జేపీసీ ఛైర్‌పర్సన్‌గా పీపీ చౌధరి- బడ్జెట్ సమావేశాల టైమ్‌లో నివేదిక! - JAMILI BILL JPC
జమిలి ఎన్నికల జేపీసీ ఛైర్‌పర్సన్‌గా రాజస్థాన్ బీజేపీ పీపీ చౌధరి
Published : 6 hours ago
తీర్మానాలకు పార్లమెంటు ఆమోదం
జమిలి ఎన్నికల బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును జేపీసీకి పంపించే తీర్మానాలను, కమిటీ సభ్యుల సంఖ్యను 39కి పెంచే ప్రతిపాదనను పార్లమెంటు ఉభయ సభలు శుక్రవారం ఆమోదించాయి. ఈ తీర్మానాలను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో, రాజ్యసభలో విడివిడిగా ప్రవేశపెట్టారు.
జేపీసీ సభ్యులుగా కె.లక్ష్మణ్, విజయసాయిరెడ్డి
జమిలి ఎన్నికల కోసం 39 మందితో ఏర్పాటుచేసిన జాయింట్ పార్లమెంటు కమిటీలో రాజ్యసభకు చెందిన 12 మంది పేర్లను వెల్లడించారు. ఇందులో తెలంగాణ నుంచి బీజేపీ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఆంధ్రప్రదేశ్ నుంచి వైకాపా సభ్యుడు వి.విజయసాయిరెడ్డిలకు అవకాశం దక్కింది. మిగిలినవారిలో బీజేపీ నుంచి ఘనశ్యాం తివారీ (రాజస్థాన్), భువనేశ్వర్ కలితా (అస్సాం), కవితా పటిదార్ (మధ్యప్రదేశ్), సంజయ్‌కుమార్ ఝా(జేడీయూ-బిహార్), కాంగ్రెస్ నుంచి రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా(రాజస్థాన్), ముకుల్ బాలకృష్ణ వాస్నిక్ (రాజస్థాన్), సాకేత్ గోఖలే (టీఎంసీ-పశ్చిమబెంగాల్), పి.విల్సన్ (డీఎంకే-తమిళనాడు), సంజయ్‌సింగ్ (ఆప్-దిల్లీ), మానస్‌రంజన్ మంగరాజ్ (బీజేడీ-ఒడిశా)కు అవకాశం కల్పించారు. దీంతో మొత్తం 39 సభ్యుల్లో బీజేపీ నుంచి 16, ఎన్డీఏ మిత్రపక్షాలు టీడీపీ, జనసేన, జేడీయూ, ఎల్‌జేపీఆర్‌పీ, శివసేన, ఆర్‌ఎల్‌డీ నుంచి ఒకొక్కరిచొప్పున ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఐదుగురు, సమాజ్ వాదీ పార్టీ నుంచి ఇద్దరు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు, డీఎంకే, సీపీఎం, ఎన్‌సీపీ, శివసేన యూబీటీ, వైసీపీ, ఆప్, బీజేడీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించినట్లయింది. ఇందులో ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి అత్యధికంగా నలుగురు సభ్యులకు స్థానం లభించింది.