One Rupee Wedding In Haryana: కేవలం ఒక్క రూపాయి కట్నం తీసుకుని తన కుమారుడికి వివాహం చేశాడు ఓ బీజేపీ నేత. పెళ్లి మండపంలో బంధువుల అందరి ముందు వధువు తండ్రి ఇచ్చిన కట్నాన్ని నిరాకరించి ఒక్క రూపాయి, కొబ్బరికాయను మాత్రమే స్వీకరించారు. ఈ ఆదర్శ వివాహం హరియాణాలో జరిగింది.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ చౌకర్ కుమారుడు గౌరవ్ సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. గౌరవ్కు హరియాణా రాష్ట్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) ఛైర్మన్ భూపాల్ సింగ్ కాదరీ కూమార్తె గరిమాతో పెళ్లి చేయాలని నిర్ణయించారు. వివాహ వేడుకలో బంధువులు అందరి ముందు వరుడికి భూపాల్ సింగ్ కట్నం ఇచ్చారు. అయితే, ఆ కట్నాన్ని వరుడి తండ్రి కృష్ణ చౌకర్ నిరాకరించారు. బ్యాగ్లో నుంచి ఒక్క రూపాయి మాత్రమే తీసుకుని మిగిలిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేశాడు. దీంతో పెళ్లికి వచ్చిన వారందరూ వరకట్నానికి వ్యతిరేకంగా ఆదర్శంగా నిలిచినందుకు కృష్ణ చౌకర్పై ప్రశంసలు కురిపించారు.
వరకట్నం సమాజానికి శాపమని బీజేపీ నేత కృష్ణ చౌకర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 'వరకట్నం తీసుకోవటం పూర్తిగా నిషేధించాలి. వరకట్నం వ్యవస్థ పూర్తిగా తొలగిన తర్వాతే కుమారుడు, కూతుళ్ల మధ్య ఉన్న వివక్షత పోతుంది. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవాలని గౌరవ్ ముందే నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయానికి తల్లిదండ్రులుగా మేము కూడా మద్దతు ఇచ్చాం' అని కృష్ణ చౌకర్ తెలిపారు.