తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేజ్రీవాల్‌పై బీజేపీ మాజీ ఎంపీ పోటీ- 29 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ - DELHI ASSEMBLY ELECTIONS

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా- కేజ్రీవాల్​కు పోటీగా మాజీ ఎంపీ పర్వేశవర్మ

Delhi BJP Candidate List 2025
Parvesh Verma, Arvind Kejriwal (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2025, 3:06 PM IST

Delhi BJP Candidate List 2025: దేశ రాజధాని దిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్‌ ప్రకటించనప్పటికీ రాజకీయ వేడి మాత్రం రాజుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నాయి. తాజాగా బీజేపీ దిల్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. న్యూదిల్లీ స్థానంలో ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం కేజ్రీవాల్‌కు పోటీగా మాజీ ఎంపీని బీజేపీ బరిలో దింపింది.

తొలి జాబితాలో 29 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. న్యూదిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ పర్వేశ్‌వర్మ పేరును ఖరారు చేసింది. ఇదే స్థానం నుంచి ఆప్ నేత కేజ్రీవాల్‌ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ కూడా ఈ స్థానానికి మాజీ సీఎం షీలాదీక్షిత్‌ కుమారుడు సందీప్‌ దీక్షిత్‌ పేరును ప్రకటించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో న్యూదిల్లీ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది.

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌ సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్‌ వర్మ 2014 నుంచి 2024 వరకు పశ్చిమ దిల్లీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన రికార్డు స్థాయిలో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దిల్లీ చరిత్రలో ఓ లోక్‌సభ అభ్యర్థి సాధించిన అత్యధిక మెజార్టీ ఇదే కావడం విశేషం.

ఇక, దిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీకి పోటీగా కల్కాజీ స్థానం నుంచి మరో మాజీ ఎంపీ రమేశ్‌ బిధూడీని నిలబెట్టింది. ఇటీవలే ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి కైలాశ్‌ గహ్లోత్‌కు ఈ ఎన్నికల్లో టికెట్‌ దక్కింది. బిజ్వాసన్‌ నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది. దిల్లీ కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ అరవింద్‌ సింగ్లీ లవ్లీ కూడా గతేడాది కమలదళంలో చేరగా, తాజా జాబితాలో గాంధీనగర్‌ స్థానం నుంచి నిలబెట్టింది.

70 శాసనసభ స్థానాలు ఉన్న దిల్లీ ప్రస్తుత అసెంబ్లీ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. మరికొన్ని రోజుల్లో ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమ్‌ఆద్మీ పార్టీ మొత్తం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కాంగ్రెస్‌ కూడా కొంతమందిని ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details