Bill Gates Meets Modi :ప్రధాని నరేంద్ర మోదీని కలవడం ఎప్పుడూ స్పూర్తిదాయకంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. భారత పర్యటలో ఉన్న ఆయన ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రజా శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ, వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధి వంటి అంశాలపై చర్చించినట్లు బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.
బిల్ గేట్స్ ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మోదీ ఇది నిజంగా అద్భుతమైన సమావేశమని పేర్కొన్నారు. భూగ్రహాన్ని మెరుగుపరిచేలా, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులను శక్తిమంతం చేసే రంగాల గురించి చర్చించడం ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రమంత్రులు, జైశంకర్, మన్‌సుఖ్ మాండవీయతోనూ బిల్ గేట్స్ భేటీ అయ్యారు. ఆరోగ్యం, విద్య, మహిళల ఆర్థిక సాధికారత వంటి అంశాలపై చర్చించారు. ఆరోగ్య మైత్రి, క్యూబ్ భీష్మ్ వంటి డిజిటల్ హెల్త్ ఆవిష్కరణలను ఆయన ప్రశంసించారు. పిల్లల పోషణ, శ్రేయస్సు కోసం కేంద్రం అమలు చేస్తున్న పోషణ్ కార్యక్రమం స్పూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఈ పర్యటనలో భాగంగానే ఆయన రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలకూ హాజరు కానున్నారు.
బిల్ గేట్స్ మంగళవారం ఒడిశాకు చేరుకున్నారు. బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. భువనేశ్వర్‌లోని మురికివాడల్లో పర్యటించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతోనూ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ)ను ఏర్పాటు చేసి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా దాన్ని సందర్శించారు. నగరంలోనే డాలీ చాయ్‌వాలాగా సామాజిక మాధ్యమాల్లో బాగా పేరు సంపాదించిన నాగ్‌పుర్ (మహారాష్ట్ర) వాసి సునీల్ పాటిల్ అందించిన తేనీటిని తాగారు. సంబంధిత వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.