Bihar Political Crisis 2024 :బిహార్‌లో అధికార కూటమి జేడీయూ, ఆర్జేడీల బంధం బీటలు వారేలా కనిపిస్తోంది. నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారిక కార్యక్రమం కోసం గవర్నర్ నివాసానికి సీఎం నీతీశ్ వెళ్లారు. కానీ మిత్ర పక్షానికి చెందిన ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ హాజరుకాకపోవడం వల్ల సంకీర్ణ కూటమి కూలిపోయే పరిస్థితులు కన్పిస్తున్నాయంటూ వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది.
సీఎంతో బీజేపీ నేత ముచ్చట!
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎం నీతీశ్ కుమార్ పాల్గొన్నా, తేజస్వీ యాదవ్ మాత్రం హాజరుకాలేదు. సీఎం పక్కన ఆయనకు కేటాయించిన స్థానంలో జేడీయూ నేత అశోక్‌కుమార్ కూర్చున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ ప్రతిపక్ష నేత విజయ్ కుమార్ సిన్హా (బీజేపీ) సీఎంతో కొంతసేపు ముచ్చటించారు.
'అది రానివాళ్లనే అడగాలి'
అయితే కార్యక్రమం అనంతరం తేజస్వీ గైర్హాజరుపై నీతీశ్‌ను మీడియా ప్రశ్నించగా, 'అది రానివాళ్లనే అడగాలి' అంటూ ఆయన సమాధానమివ్వడం గమనార్హం. ఇదే విషయంపై మరో జేడీయూ నేత, మంత్రి అశోక్ చౌదరిని విలేకర్లు ప్రశ్నంచగా, 'దీనికి నేనేం చెప్పగలను. ఎవరు రాలేదో వాళ్లు మాత్రమే సమాధానం చెప్పగలరు' అన్నారు. దీంతో బిహార్ రాజకీయాల్లో మరో రెండు రోజుల్లో కీలక పరిణామాలు జరగనున్నాయని చర్చ ఊపందుకుంది.
పోటాపోటీగా సమావేశాలు!
రాష్ట్రంలో కీలక పరిణామాలు జరగనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సమావేశాలు ఏర్పాటు చేశాయి. "లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావడానికి శనివారం సాయంత్రం 4 గంటలకు బీజేపీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌కు ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరకానున్నారు" అని బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి తెలిపారు. మరోవైపు, పూర్ణియాలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు.
క్లారిటీ ఇవ్వాలని ఆర్జేడీ రిక్వెస్ట్
మరోవైపు రాష్ట్రంలోని మహాకూటమి ప్రభుత్వంలో నెలకొన్న గందరగోళానికి సీఎం నీతీశ్ తెరదించాలని ఆర్జేడీ విజ్ఞప్తి చేసింది. జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో జతకట్టనున్నారని ప్రచారంపై స్పష్టత ఇవ్వాలని ఆశిస్తున్నట్లు ఆర్జేడీ ఎంపీ మనోజ్‌కుమార్ ఝా చెప్పారు. బిహార్ ప్రజల సంక్షేమంతోపాటు బీజేపీని ఓడించేందుకు ఆర్జేడీ-జేడీయు చేతులు కలిపినట్లు తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధ వాతావరణం బిహార్ ప్రజలపై ప్రభావం చూపుతోందని, సీఎం నీతీశ్‌కుమార్ మాత్రమే దానికి తెరదించగలరని ఆర్జేడీ ఎంపీ ఝా తెలిపారు.