Balcony Viral Video Mother Self Harm : సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేస్తున్నారని మనస్తాపం చెందిన రమ్య అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. ఇటీవల చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్ పైకప్పు ప్లాస్టిక్ షీట్‌కు ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ ఉన్న వీడియో వైరల్‌గా మారింది. ఇదే ఘటనపై నెటిజన్లు వ్యవహరించిన తీరు ఇప్పుడా బిడ్డకు తల్లిని దూరం చేసింది. నెట్టింట విమర్శలు తట్టుకోలేక ఆ చిన్నారి తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
ఇదీ జరిగింది
ఏప్రిల్ 28న చెన్నైలో ఓ 8నెలల శిశువు అపార్ట్‌మెంట్‌లోని బాల్కనీ రేకులపై ప్రమాదకరంగా వేలాడగా స్థానికులు రక్షించిన ఘటన వైరల్ అయింది. సిసింద్రీ సినిమాలో లాగా ప్రమాదకరచోటుకు పాకుతూ వెళ్లిన ఆ శిశువును, కింద దుప్పట్లు పరచి స్థానికులు రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరలయ్యింది. దీంతో పాపను రక్షించిన వారిని ప్రశంసించిన నెటిజన్లు, చిన్నారి తల్లి విషయంలో దూషణలకు దిగారు. పసిబిడ్డను చూసుకోవడం చేతకాదా అంటూ తల్లి రమ్యను ఆడిపోసుకున్నారు. పాపను అలా నిర్లక్ష్యంగా వదిలేసినందువల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటన తర్వాత డిప్రెషన్‌కు గురైన రమ్య, కోయంబత్తూరులోని తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రమ్య, ఆదివారం ఇంట్లోని కుటుంబ సభ్యులు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. వారు తిరిగి వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ కారణంగా ఆమె మానసికంగా కుంగిపోయిందని, దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.