Baba Siddique Murder Case Updates :మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని హత్య చేసింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. సోషల్ మీడియాలో వచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు వైరల్ అయ్యింది. అయితే ఇది బిష్ణోయ్ గ్యాంగ్ నిజంగా చేసిందా? లేదా ఏదైనా ఫేక్ న్యూసా అనేది తేలాల్సి ఉంది.
పక్కా ప్లాన్ ప్రకారం!
హత్యకు కొన్ని నెలల ముందు నుంచే సిద్ధిఖీ నివాసం సహా, ఇతర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు కాల్పులు జరిపిన నిందితులు కర్నైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్ క్రైమ్ బ్రాంచ్ విచారణలో చెప్పారు. తాము బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని వారు వెల్లడించారు. కాల్పులు జరిపిన ముగ్గురు నిందితులకు రూ.50వేలు చొప్పున సుపారీ డబ్బును అడ్వాన్స్‌గా బిష్ణోయ్‌గ్యాంగ్ అందించిందని తెలిసింది. హత్యకు కొన్ని రోజుల ముందే ఆయుధాలను పార్శిల్‌లో సరఫరా చేసినట్లు సమాచారం. నిందితులకు మొత్తం రూ.25 లక్షలు ఇవ్వజూపినట్లు తేలింది. ఓ మురికివాడ పునరావాస ప్రాజెక్టు విషయంలో తలెత్తిన విభేదాలే హత్యకు కారణమయ్యాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. 2000-2004 వరకు ఎంహెచ్డీఏ ఛైర్మన్‌గా ఉన్నపుడు చేపట్టిన స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టులో రూ.2వేల కోట్ల స్కామ్ జరిగినట్లు సమాచారం. ఆ కేసుకు సంబంధించి 2018లో ఈడీ రూ.462 కోట్ల విలువైన సిద్ధిఖీ ఆస్తులను అటాచ్ చేసింది. సిద్ధిఖీకి ప్రాణ హాని ఉందని అతడి సన్నిహితులు పేర్కొన్న నేపథ్యంలో 15 రోజుల క్రితమే ఆయనకు 'వై కేటగిరీ' భద్రత కూడా కల్పించారు. కానీ ఆయన హత్య జరిగిపోయింది. దీనితో బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ఉన్న సల్మాన్‌ఖాన్‌కు ముంబయి పోలీసులు భద్రతను పెంచారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ సిద్ధిఖీ హత్య దుమారం రేపుతోంది.