Ayodhya Ram Statue Photo :అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠకు ముందే బాలరాముడి విగ్రహం చిత్రాలు బయటకు వచ్చాయి. గురువారమే రాముడి విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య రామ మందిరం గర్భగుడిలోకి చేర్చారు. గర్భగుడిలో కళ్లకు గంతలు కట్టి ఉన్న రాముడి విగ్రహం ఫొటోలు ఇదివరకే బయటకురాగా తాజాగా గర్భగుడిలో చేర్చకుముందు కళ్లకు గంతలు లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. బాల రాముడి చేతిలో బంగారు విల్లు, బాణాలు ఉన్నట్లు ఆ చిత్రాల్లో ఉంది.
మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. 51 అంగుళాల పొడవైన బాలరాముడి విగ్రహం దైవత్వం ఉట్టిపడేలా భక్తులను మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలను బాలరాముడి విగ్రహానికి ఇరువైపులా ఉండేలా అద్భుతంగా మలిచారు. బాలరాముడి విగ్రహం పైభాగంలో ఓం, గణేశ, చక్రం, శంఖం, గద, స్వస్తిక్ గుర్తు ఉన్నాయి. కమల నయనాలను పోలినట్లు బాలరాముడి కళ్లను తీర్చిదిద్దారు. బాలరాముడి విగ్రహం కింద భాగంలో ఒకవైపు హనుమ, మరొకవైపు గరుడ ఉండేటట్లు విగ్రహాన్ని మలిచారు. మరోవైపు, అయోధ్యలో 300 అడుగుల దియా(మట్టి దీపం)ను వెలిగించారు. ఈ దీపం ప్రపంచంలో అతిపెద్దదని తెలుస్తోంది.