Indiramma House Super CheCk Survey : పేదల సొంతింటి కళ సాకారం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు జరిగిన సర్వేలో వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు సూపర్ చెక్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత సంవత్సరం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పుర సిబ్బందితో ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల సర్వే చేపట్టారు. మరోవైపు లభ్ధిదారుల ఎంపికలో సర్కారు పారదర్శకతకు పెద్దపీట వేస్తుంది.
వాస్తవాలు తెలుసుకునేందుకు సూపర్ చెక్ : ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుదారుల వివరాలు మాత్రమే యాప్‌లో నమోదు చేశారా, దరఖాస్తు చేయని వారిని నమోదు చేశారా, దరఖాస్తుదారులు ప్రస్తుతం ఉంటున్న ఇళ్లు ఏ విధంగా ఉన్నాయి. ఎక్కడ ఉంటున్నారు. సొంతిల్లా, అద్దెకు ఉంటున్నారా అనే అంశాలను తెలుసుకునేందుకు సూపర్ చెక్ చేపడుతున్నారు.
సూపర్ చెక్ పేరుతో వివరాలు : వివరాలు వాస్తవానికి విరుద్ధంగా యాప్‌లో నిక్షిప్తమై ఉంటే వాటిని తీసేస్తున్నారు. గ్రామం, డివిజన్, వార్డుల్లో సర్వే చేపట్టిన వాటిల్లో 5 శాతం ఇళ్ల వివరాలను ప్రభుత్వం మండలాల్లోని ఎంపీడీవోలకు, పురపాలక సంఘాల్లో కమిషనర్ల లాగిన్‌కు పంపించింది. దాని ప్రకారం ప్రత్యేక సిబ్బంది సూపర్ చెక్ పేరుతో వివరాలు తీసుకుంటున్నారు. దీంతో అర్హులకు మాత్రమే ఇళ్లు లభించే అవకాశం ఉంది.
96 శాతం సర్వే పూర్తి : రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా జిల్లాలో 96.44 శాతం సర్వే పూర్తయింది. ప్రజాపాలనలో ఇళ్ల కోసం 3,20,831 దరఖాస్తులు రాగా ఇప్పటికే 3,09,398 సర్వే పూర్తి చేశారు. సర్వే ముగిసిన తర్వాత లబ్ధికదారుల ఎంపికకు గ్రామ సభలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో ఇందిరమ్మ కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం పనులు జరిగితే ఈఏడాది పేద కుటుంబాల సొంతింటి కల నెరవేరనుంది. సూపర్ చెక్ జరుగుతుందని త్వరలోనే పూర్తవుతుందని గృహ నిర్మాణశాఖ ఏఈ సత్యనారాయణ తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల సర్వేలు - అనర్హుల నుంచే భారీగా దరఖాస్తులు - అయోమయంలో అధికారులు!
ఇందిరమ్మ ఇళ్లపై ఫిర్యాదులా? - ఈ వెబ్సైట్లో ఫిర్యాదు చేసేయండి