తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య అంతా రామమయం'- ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధం

Ayodhya Ram Mandir Pran Pratishtha : శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో నిర్మించిన భవ్యమందిరంలో రాములోరి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం కన్నుల పండువుగా జరగనుంది. ప్రధాని మోదీ సహా 7వేల మంది అతిథుల సమక్షంలో మంగళధ్వని మధ్య ఈ కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ సర్వం సిద్ధం చేసింది. భక్తులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.

Ayodhya Ram Mandir Pran Pratishtha
Ayodhya Ram Mandir Pran Pratishtha

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 5:47 PM IST

Updated : Jan 22, 2024, 10:17 AM IST

Ayodhya Ram Mandir Pran Pratishtha :అయోధ్య రామమందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కోసం రామజన్మభూమి అందంగా ముస్తాబైంది. ఈనెల 16 నుంచి నిర్వహిస్తున్న క్రతువులు సోమవారం ఉదయం కల్లా పూర్తి కానున్నాయి. సరిగ్గా మధ్యాహ్నం శుభముహూర్తం 12 గంటల 20 నిమిషాలకు అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభమై, దాదాపు ఒంటిగంటకు పూర్తికానుంది. ప్రధాని నరేంద్ర మోదీ, సాధుసంతువులు, ప్రముఖులు కలిపి ఏడు వేల మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. 7 వేల మందిలో జాబితా A 506 మంది అత్యంత ప్రముఖులను చేర్చారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 జంటలు ప్రాణప్రతిష్ఠకు అతిథేయులుగా వ్యవహరించనున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య రామాలయాన్ని వైవిధ్యమైన పూలతోనూ, రంగురంగుల విద్యుద్దీపాలతోనూ అలంకరించారు.

ప్రాణప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

శ్రీరాముడి భవ‌్యమందిరాన్ని జీ+2 పద్దతిలో నిర్మించారు. భక్తులు తూర్పున 32 మెట్లు ఎక్కి ప్రధాన ఆలయంలోకి చేరుకునేలా ఏర్పాటు చేశారు. ఆలయ సముదాయాన్ని ఆధునికంగా తూర్పు నుంచి పశ్చిమానికి 380 అడుగులతో సంప్రదాయ నగర విధానంలో నిర్మించారు. 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తున భవ్య మందిరం ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తున మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లతో నిర్మించారు. ఆలయంలో మరో అంతస్తు నిర్మించాల్సి ఉందని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ట్రెజరర్‌ గోవింద్ దేవ్ గిరి చెప్పారు. ఇప్పటివరకు రామమందిర నిర్మాణానికి 1100 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి మరో రూ. 300 కోట్లు ఖర్చు అవుతుందని వివరించారు. ఆలయంలోకి తూర్పు నుంచి ప్రవేశం, దక్షిణం వైపు నుంచి నిష్క్రమణ ద్వారం ఏర్పాటు చేసినట్లు శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్ చెప్పారు.

ప్రాణప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు

నూతన మందిరానికే పాత విగ్రహం
మైసూరుకు చెందిన అరుణ్‌ యోగిరాజు తీర్చిదిద్దిన 51అంగుళాల శ్రీరాముడి నూతన విగ్రహం ఇప్పటికే గర్భగుడిలో కొలువుదీర్చారు. కోర్టు సహా పలు వివాదాల కారణంగా అనేక సంవత్సరాలుగా తాత్కాలిక మందిరంలోనే ఉండిపోయిన రామ్‌ లల్లా విరాజ్‌మాన్‌ విగ్రహాన్ని భవ్యమందిరంలో నూతన విగ్రహం ముందు ప్రతిష్ఠించనున్నారు. రామ్‌ లల్లా విరాజ్‌మాన్‌ విగ్రహం ఐదు నుంచి ఆరు అంగుళాలు మాత్రమే ఉంటుందని 25 నుంచి 30 అడుగుల దూరం నుంచి వీక్షించడం భక్తులకు సులభంకాదని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ట్రెజరర్‌ గోవింద్ దేవ్ గిరి చెప్పారు.

50 రకాల ప్రఖ్యాత సంగీత వాయిద్యాలతో మంగళధ్వని
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మంగళధ్వని మధ్య నిర్వహిస్తామని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సంగీత ప్రపంచంలో పేరున్న విద్వాంసులు మంగళధ్వని కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన 50 సంగీత వాయిద్యాలకు ఒకే వేదికపై చోటు కల్పించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఘటం, కర్ణాటక నుంచి వీణ, తమిళనాడు నుంచి నాగస్వరం, మృదంగం ఈ జాబితాలో ఉన్నాయి. మొత్తం రెండు గంటల పాటు మంగళధ్వని కార్యక్రమం ఉంటుందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది. న్యూదిల్లీలోని సంగీత నాటక అకాడమి మద్దతుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

అయోధ్య అంతా రామమయం
శ్రీరాముడి జన్మభూమి మొత్తం కాషాయం జెండాలతో ఆధ్యాత్మికశోభను నింపుకుంది. అయోధ్యలో ఎటుచూసినా సీతాపతి కటౌట్లు, చిత్రాలే దర్శనం ఇస్తున్నాయి. శ్రీరాముడిని కీర్తిస్తూ, ప్రాణప్రతిష్ఠకు అతిథులను ఆహ్వానిస్తూ పోస్టర్లు, హోర్డింగ్‌లు వందలాదిగా వెలశాయి. రామ్‌మార్గ్, సరయు నది, లతామంగేష్కర్ చౌక్‌లో రఘురాముడి కీర్తనల చరణాలను ముద్రించారు. ప్రాణప్రతిష్ఠ రోజు సాయంత్రం సుమారు 10లక్షల దీపాలను వెలిగించనున్నారు. దేశవ్యాప్తంగా శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఆహ్వానం అందుకున్న వందలాది సాధువులు, ఇప్పటికే అయోధ్యకు చేరుకుంటున్నారు. లక్షలాది మంది ప్రజలు ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తారని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తితే వైద్యం అందించేందుకు అయోధ్యలో, జిల్లా ఆసుపత్రుల్లో, వైద్య కళాశాలలోనూ బెడ్లను రిజర్వు చేశారు. ఆయా ఆరోగ్య సంస్థల్లో సిబ్బందికి ఎయిమ్స్‌ వైద్యుల ద్వారా అత్యవసర వైద్యానికి అవసరమైన శిక్షణ ఇచ్చారు.

భద్రతా బలగాల నీడలోకి అయోధ్య
మరోవైపు బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైన వేళ అయోధ్య భద్రతా బలగాల నీడలోకి వెళ్లిపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీస్ విభాగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో పాటు పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను రంగంలోకి దించారు. పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను మోహరించారు. సాధారణ దుస్తులు ధరించిన పలువురు పోలీసులు ప్రజల్లో కలిసిపోయి అనుమానితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ పోలీసులకు రెండు, అంతకంటే ఎక్కువ భాషలు వచ్చని అధికారులు తెలిపారు.

అయోధ్యలో అధికారుల గస్తీ

10వేల సీసీటీవీలతో పర్యవేక్షణ
అయోధ్యలో 10వేల సీసీటీవీలు ఏర్పాటు చేసి అణువణువూ జల్లెడ పడుతున్నారు. మరింత నిఘా కోసం కొన్ని సీసీ కెమెరాల్లో కృత్రిమ మేధను(AI) వినియోగించినట్టు అధికారులు తెలిపారు. డ్రోన్ల ముప్పును ఎదుర్కొనేందుకు యాంటీ డ్రోన్ జామర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎలాంటి ప్రమాదకర పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనే శక్తి ఉన్న NDRF బృందాలను అయోధ్యకు రప్పించారు. ఈ బృందాలు రసాయన, అణు దాడులు, భూకంపాల వంటి విపత్తులను ఎదుర్కొనే విధంగా శిక్షణ పొందారని అధికారులు తెలిపారు.

అయోధ్యలో అధికారుల గస్తీ

చెక్​పోస్ట్​లు ఏర్పాటుచేసి తనిఖీలు
అయోధ్యకు వచ్చే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాసులో ప్రత్యేక రీడర్ కోడ్‌తో సరిపోలితేనే లోపలికి అనుమతి ఇస్తున్నారు. QR కోడ్​తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ, విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు సరయూ నది వెంబడి NDRF, SDRF బృందాల సహాయంతో భద్రతను పెంచినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ, అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్టు వివరించారు.

సీతాదేవి స్వస్థలంలో ప్రాణప్రతిష్ఠ సందడి- జనక్​పుర్​లో అంగరంగ వైభవంగా వేడుకలు

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ- ఆహ్వానం అందుకున్న దిగ్గజాలు వీరే

Last Updated : Jan 22, 2024, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details