Ayodhya Ram Mandir Decoration For Opening :జనవరి 22న జరిగే రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయోధ్యలోని రామాలయాన్ని రిచ్స్టాక్ పూలతో, ప్రత్యేక దీపాలతో ముస్తాబు చేశారు. రామయ్య ప్రాణప్రతిష్ఠ రోజు వరకు ఈ ప్రత్యేక పూల అలంకరణలు జరగనున్నాయి.
'ఇవన్ని సహజ పుష్పాలు. ప్రస్తుతం శీతాకాలం కావడం వల్ల ఎక్కువ వాడిపోకుండా ఉంటాయి. కాబట్టి అవి రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ రోజు వరకు తాజాగా ఉంటాయి.అంతేగాక ఈ పువ్వులు మంచి వాసనను ఇస్తాయి. అలాగే చూడడానికి అందంగా ఉంటాయి.' అని అధికారి ఒకరు మీడియాతో చెప్పారు. ఆలయంలో పూల అలంకరణ, విద్యుత్ లైట్ల ఏర్పాటు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఆలయ ట్రస్టు అధికారుల ఆధ్వర్యంలో వీరంతా సమష్ఠిగా పనిచేస్తున్నారని తెలిపారు.
మరోవైపు, ఒడిశాకు చెందిన ప్రముఖ సైకితశిల్పి సుదర్శన్ పట్నాయక్ రామ్‌కథా పార్క్ వద్ద అయోధ్య రామాలయ నమూనాను ఇసుకతో తీర్చిదిద్దారు.
అప్రమత్తమైన అధికారులు
అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠకు మరికొద్ది గంటలు సమయం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) రామ మందిరం సమీపంలో శిబిరాన్ని ఏర్పాటు చేసింది. 'జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ముందు ఇక్కడ మూడు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు మోహరించాయి. స్థానిక పరిపాలన యంత్రాంగం, పోలీసులతో సమన్వయం చేసుకుంటున్నాం.'ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్ శర్మ తెలిపారు.
ఉగ్రసంస్థ బెదిరింపులు
ఆధ్యాత్మిక నగరి అయోధ్యపురిలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రసంస్థ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అమాయక ముస్లింలను చంపి రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారని హెచ్చరించింది. జైషే హెచ్చరికతో భద్రతాదళాలు అప్రమత్తమయ్యాయి. అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించారు. రామమందిర ప్రాణప్రతిష్ట మహోత్సవం నేపథ్యంలో అయోధ్యలో భద్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల ముగ్గురు ఖలిస్థానీ సానుభూతిపరులను అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే పన్నూనిన్న హెచ్చరిక చేశాడు.
'బాంబు పెట్టి పేల్చేస్తాం'
బిహార్ అరారియాకు చెందిన ఓ యువకుడు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజే ఆలయాన్ని బాంబు పెట్టి పేల్చేస్తామని పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. తాను అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌కు చెందిన ఛోటా షకీల్‌గా చెప్పుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సైబర్ సిబ్బంది సాయంతో నిందితుడిని మహ్మద్ ఇంతాఖాబ్(21)గా గుర్తించారు. నిందితుడి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు.