Ashok Chavan Joins BJP : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బీజేపీలో చేరారు. అందరి ఊహాగానాలను నిజం చేస్తూ మంగళవారం మధ్యాహ్నం ఆయన ముంబయిలోని పార్టీ కార్యాలయంలో అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు(మంగళవారం) నుంచి కొత్త రాజకీయ జీవితాన్ని తాను ప్రారంభించనున్నట్లు అశోక్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే హాజరయ్యారు. అశోక్‌తో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ అమర్ రాజుర్కర్ కూడా కాంగ్రెస్‌ను వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు.
'రాహుల్, సోనియా నుంచి ఫోన్లు వచ్చాయా?'
తనతోపాటు బీజేపీలో చేరమని తాను ఏ కాంగ్రెస్ నాయకులను సంప్రందించలేదన్నారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా అని విలేకరుల అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అశోక్ నిరాకరించారు. కాంగ్రెస్‌ను వీడటానికి గల సరైన కారణాలను చెప్పకుండా ఇది తన సొంత నిర్ణయమని చెప్పారు. అయితే హస్తం పార్టీని వీడి కమలం పార్టీలో చేరుతున్న నేపథ్యంలో ఆ పార్టీ నుంచి అశోక్ చవాన్‌కు రాజ్యసభ టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాగా, ఇటీవలే సీనియర్ నేతలు బాబా సిద్ధిఖ్, మిలింద్ దేవరా సైతం మహా కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన కొద్దిరోజులకే అశోక్ పార్టీని వీడారు.
అంతకుముందు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌కు సోమవారం లేఖను పంపించారు అశోక్ చవాన్. అందులో కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో రానున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు అశోక్ చవాన్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం మహా కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.