Hyderabad to Arunachalam Tour Package :సమ్మర్లో విద్యార్థుల స్కూల్స్ ముగిసిన తర్వాత.. అందరూ పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి, ఆధ్యాత్మిక యాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. మరి.. మీరు కూడా ఇలాంటి టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టయితే.. ఆ దర్శనీయ ప్రాంతాల్లో అరుణాచల పుణ్యక్షేత్రానికీ చోటివ్వండి. అరుణాచల గిరిప్రదక్షిణకు వెళ్లాలనుకునే వారికోసం తెలంగాణ టూరిజం శాఖ సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ పర్యటన హైదరాబాద్ నుంచి అరుణాచలం(Arunachalam)వరకు రోడ్డు మార్గం ద్వారా 4 రోజుల పాటు సాగుతుంది. మరి.. ఈ టూర్ ప్యాకేజీ ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉంటుంది? ధర ఎంత? వంటి ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పౌర్ణమిని పురస్కరించుకొని.. తెలంగాణ టూరిజం శాఖ అరుణాచలం స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్(Hyderabad) నుంచి ఆపరేట్ చేస్తున్న ఈ టూర్ ప్యాకేజీ ప్రస్తుతం ఏప్రిల్ 21వ తేదీ రోజు అందుబాటులో ఉంది. ఆ తర్వాత మేలో 20వ తేదీ నాడు, జూన్లో 19వ తేదీ రోజు అందుబాటులో ఉండనుంది. ఇక 3 రాత్రులు, 4 రోజులు సాగే ఈ పర్యటనలో అరుణాచలేశ్వర ఆలయంతోపాటు కాణిపాకం, వేలూరు గోల్డెన్ టెంపుల్ కవర్ అవుతాయని తెలంగాణ టూరిజం శాఖ తెలిపింది.
హైదరాబాద్ - అరుణాచలం పర్యటన కొనసాగనుందిలా..
- మొదటి రోజు ఈ టూర్ హైదారాబాద్లోని బషీర్ బాగ్ నుంచి సాయంత్రం 6.30 గంటలకు స్టార్ట్ అవుతుంది.
- రెండో రోజు ఉదయం 6 గంటలకు కాణిపాకం రీచ్ అవుతారు. అక్కడ ఫ్రెషప్ అయ్యి మార్నింగ్ 9 గంటల లోపు దర్శనం కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత తిరువణ్ణామలైకి బయల్దేరుతారు.
- మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం చేరుకుంటారు. అనంతరం.. అరుణాచలేశ్వరస్వామి దర్శనం పూర్తి చేసుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు.
- మూడో రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నానికి వేలూరు చేరుకుంటారు. అనంతరం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ను దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణమవుతారు.
- నాలుగో రోజు ఉదయం హైదరాబాద్కు చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.