తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహిళల కోసం స్పెషల్ షూ- ఒక్క 'కిక్' ఇస్తే కామాంధులకు గట్టి షాకే! - WOMEN SAFETY SHOES

మహిళల భద్రతకు ప్రత్యేక షూస్- మహిళలను వేధిస్తే కరెంట్ షాక్ ఇచ్చే షూస్ తయారీ

Women Safety Shoes
Women Safety Shoes (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2025, 2:29 PM IST

Women Safety Shoes :మహిళలు, విద్యార్థినులను వేధించే వారికి ఇక ఇన్‌స్టంట్ షాక్‌లు తప్పవు. ఆ విధమైన పవర్​ఫుల్ షూస్ రెడీ అయ్యాయి. మహిళలను వేధిస్తే చాలు వారికి కరెంట్ షాక్​ ఇచ్చేలా తయారు చేశాడు రాజస్థాన్​కు చెందిన ఓ పాలిటెక్నిక్ విద్యార్థి.

అల్వార్ జిల్లాలోని లిలీ గ్రామానికి చెందిన పాలిటెక్నిక్ కళాశాలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థే వివేక్ చౌధరి. దాదాపు 2 నెలల పాటు శ్రమించి రూ.3,500 ఖర్చుతో ఈ స్పెషల్ ఈ షూస్​ను తయారు చేశాడు. ఈ బూట్లను ధరించిన మహిళ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బూట్ల వెనుక భాగాన్ని (మడమను) బలంగా నేల వైపు‌నకు నెట్టాలి. ఆ వెంటనే స్పెషల్ షూస్‌లో ఉన్న ఒక పరికరం యాక్టివేట్ అయిపోతుంది.

ఆ తర్వాత సదరు మహిళను వేధిస్తున్న వ్యక్తికి కరెంటు షాకులు తగలడం మొదలవుతుంది. షూస్‌‌లో ఉండే ఆ ప్రత్యేక పరికరాన్ని ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే వరుసపెట్టి 1000 షాకులు ఇవ్వగలదు. అంతేకాదు ఈ షూస్‌లో జీపీఎస్, లొకేషన్ ట్రాకర్ సైతం ఉన్నాయి. వేధింపులను/దాడిని ఎదుర్కొంటున్న బాధిత మహిళ లొకేషన్ వివరాలు ఆమెకు సంబంధించిన ముగ్గురు కుటుంబీకుల ఫోన్ నంబర్లకు చేరుతాయి. ఎవరెవరి ఫోన్ నంబర్లను అందులో ఫీడ్ చేయాలనేది సదరు మహిళ నిర్ణయించుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ బూట్లను వైర్‌లెస్ పద్ధతిలో ఛార్జింగ్ చేసేలా డెవలప్ చేస్తానని వివేక్ తెలిపాడు.

మహిళ భద్రత కోసం ఏర్పాటు చేసిన పరికరం (ETV Bharat)

స్నేహితులకు చెబితే నవ్వారు
ఏడాది క్రితం అల్వార్ జిల్లా పరిధిలో మహిళలపై జరిగిన పలు నేర ఘటనల వార్తలు వివేక్ చౌధరిని ఆలోచింపజేశాయి. వనితల భద్రత కోసం తనవంతుగా ఏదైనా చేయాలని వివేక్ సంకల్పించాడు. తన సంకల్పం గురించి డైరీలో రాసుకున్నాడు. ఆనాటి నుంచే అందుకోసం కసరత్తు చేయడం మొదలుపెట్టాడు. ఈవిషయాన్ని కొందరు స్నేహితులకు వివేక్ చెబితే, విని నవ్వారు. షాక్ ఇచ్చే షూస్ తయారు చేయడం అసాధ్యమన్నారు. దీంతో ఇక స్నేహితులకు చెప్పడం మానేశాడు. కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా ఒంటరిగానే షూస్ తయారీ చేసినట్లు పేర్కొన్నాడు.

ఇంటర్నెట్, యూట్యూబ్ నుంచి సమాచారం
ఇంటర్నెట్, యూట్యూబ్ వీడియోల నుంచి చాలా వివరాలను సేకరించాడు. వాటి ప్రాతిపదికన మహిళల భద్రత కోసం స్పెషల్ షూస్‌ను తయారు చేశాడు. వీటికి WSS (మహిళల భద్రతా షూస్) అని వివేక్ పేరు పెట్టాడు. వీటిలో జీపీఎస్ మోడల్, ఐసీ, పవర్ మాడ్యులేటర్, వోల్టేజ్ బూస్టర్ వంటి అనేక పరికరాలు అమర్చి ఉన్నాయి. తమ వాడు ఈ షూస్‌ను తయారు చేశాడని తెలియడం వల్ల వివేక్ కుటుంబీకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ బూట్లను అల్వార్ జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు అధికారులకు వివేక్ చూపించాడు. దీంతో వారు కూడా అతడిని అభినందించారు.

వివేక తయారు చేసిన షూస్ (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details