Advance Train Reservation Period New Rules : రైలు టికెట్ల ముందస్తు రిజర్వేషన్ సమయాన్ని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణానికి 120 రోజుల ముందుగానే బుకింగ్ చేసుకునే సదుపాయం ఉంది. దాన్ని తాజాగా 60 రోజులకు కుదించింది. ఇందుకోసం ఐఆర్‌సీటీసీ నిబంధనల్లో మార్పులు చేసింది. నవంబర్ 1, 2024 నుంచి ఈ కొత్త నిబంధన అమలు కానుంది. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదని రైల్వే వర్గాలు తెలిపాయి. ఇక అక్టోబర్ 31 వరకు రిజర్వేషన్ చేసుకునే వారికి పాత నిబంధనే వర్తిస్తుందని చెప్పాయి. అయితే, ఈ అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్‌ను(ఏఆర్పీ) తగ్గించడానికి గల కారణాలను మాత్రం రైల్వే వెల్లడించలేదు.
మరోవైపు తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్ల బుకింగ్‌లో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పటికే వాటిలో బుకింగ్ వ్యవధి తక్కువగా ఉంది. ఇక విదేశీ పర్యటకులు మాత్రం 365 రోజుల ముందుగానే టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా ఇందులోనూ ఎలాంటి మార్పూ చేయలేదు. కాగా, 2015 మార్చి 25న రైల్వే శాఖ ఏఆర్పీని 60 రోజుల నుంచి 120 రోజులకు పెంచింది.